ఘనంగా "దేవగుడి" సినిమా ట్రైలర్ లాంఛ్
అభినవ శౌర్య, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా, రఘు కుంచె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అభినవ్ శౌర్య మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తే, మాలాంటి కొత్త టాలెంట్ బయటకొస్తుంది’’ అన్నారు.
‘‘నిజజీవిత సంఘటన ఆధారంగా షార్ప్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా తీశాం. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలోని ప్రధానాంశాలు. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని చెప్పారు బెల్లం రామకృష్ణా రెడ్డి. ‘‘నటుడిగా నా కెరీర్‌లో ఎప్పుడూ చేయనటువంటి యాక్షన్ సీక్వెన్స్‌ను ఈ సినిమా కోసం చేశాను’’ అని తెలిపారు రఘు కుంచె.
‘‘అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి వస్తే ఎంత నెగటివ్‌గా మాట్లాడతారో తెలుసు. నేనీ సినిమా చేస్తున్నప్పుడు అలా నెగటివ్‌గా మాట్లాడినవారే, ఇప్పుడు తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు బాధపడిన నేను ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాను’’ అన్నారు అనుశ్రీ. సంగీతదర్శకుడు ఎస్కే మదీన్, ఛాయాగ్రాహకుడు లక్ష్మీకాంత్ కనిక మాట్లాడారు.


