
‘‘సినిమా అనేది జీవనది లాంటిది. కొన్నిసార్లు అది వేగంగా ముందుకు వెళుతుంది. కొన్నిసార్లు లోతు పెంచుకోవడానికి ఆగుతుంది. ‘ఘాటీ’ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు... అది పర్వతాల ప్రతిధ్వని, అడవిలోని చల్లటి గాలి. మట్టి నుంచి, రాతి నుంచి చెక్కిన కథ. ప్రతి ఫ్రేమ్‌ని అద్భుతంగా ఆవిష్కరించడం కోసం మేం మరికొంత సమయం వెచ్చించాలనుకున్నాం’’ అని ‘ఘాటీ’ చిత్రబృందం ఓ లేఖ విడుదల చేసింది. అనుష్క లీడ్ రోల్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన చిత్రం ‘ఘాటీ’.
ఈ నెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే వాయిదా వేసినట్లు పేర్కొని, శనివారం ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మా సినిమా కోసం ఎదురు చూసే ప్రేక్షకుల నిరీక్షణకు తగ్గట్టు ఓ అద్భుతమైన, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి దక్కుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. బాధితురాలైన ఓ మహిళ పగ తీర్చుకునే క్రమంలో నేరస్థురాలిగా ఎలా మారింది? ఆ తర్వాత ఎలా లెజెండ్ అయింది? అనేది ‘ఘాటీ’ చిత్రం ప్రధానాంశం. విజువల్ ఎఫెక్ట్స్‌కిప్రాధాన్యం ఉన్న చిత్రం కావడంతో, ఆ పనులు పూర్తి కాకపోవడం వల్లే రిలీజ్‌ను వాయిదా వేశారట.