టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ‘దేవసేన’కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్‌గా అనుష్క నటించిన 'ఘాటీ' కాస్త నిరాశపరిచింది. కానీ, 'కతనార్' అనే లేడీ ఓరియెంటేడ్ మలయాళ సినిమాతో త్వరలో రానుంది. నేడు అనుష్క 44వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్‌మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది.

పొట్టి దుస్తులు వల్ల కన్నీళ్లు పెట్టుకున్న స్వీటీ
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు పూర్తి చేసుకున్న దేవసేన... 2005 సూపర్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమై అనతి కాలంలోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా హోదా సంపాదించారు. పూరీ జగన్నాథ్ ‘సూపర్’లో నటించేందుకు హీరోయిన్ కోసం చూస్తున్న సమయంలో ఆయన స్నేహితుడు యోగా టీచర్‌గా పనిచేస్తున్న అనుష్క ఫోటో చూపించారు. అలా అనుష్కను పూరీ కలిశారు. సినిమా గురించి చర్చించిన తర్వాత ఆమె హైదరాబాద్‌కు రావడం ఆపై తొలి సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు.
కెమెరా ముందు పొట్టి దుస్తులు వేసుకుని మొదట నటించాలంటే ఆమె చాలా ఇబ్బంది పడింది. ఈ క్రమంలో తాను చాలాసార్లు కన్నీళ్లు పెట్టుకున్నట్లు కూడా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే, చాలా పట్టుదలతో వాటిని ముందుకు వెళ్లానని చెప్పింది. బిల్లా సినిమాలో ఆమె ఏకంగా బికినీ ధరించి అందరికీ షాకిచ్చింది. మొదటిసారి పూరీ జగన్నాథ్‌ను కలవడాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పంచుకుంది. 2005లో తన జీవితాన్ని మార్చేసిన రోజు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆమె చెప్పింది.
సూపర్ చిత్రం తర్వాత ‘మహానంది’లో హీరో సుమంత్‌కు జోడిగా నటించింది అనుష్క. అయితే ఈ చిత్రం ద్వారా ఆమెకు పెద్దగా పేరు రాలేదు. మాస్ మహారాజా , రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’తో అనుష్క్‌కు స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్లాపులు పడినప్పటికీ.. 2009లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘అరుంధతి’తో అనుష్క జీవితమే మారిపోయింది. ఆ సినిమాలో యువరాణి జేజమ్మగా అనుష్క అభినయానికి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

పేరు ఎందుకు మార్చుకుంది
అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి అని చాలామందికి తెలుసు.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనే పేరును మార్చుకుంది. అనుష్కకు స్వీటీ అని తన పిన్ని పెట్టింది. అయితే, ఆ పేరును అమ్మవాళ్లు ప్రతి సంవత్సరం మారుస్తాం అని మాటిస్తూ పోయారని పదో తరగతి తర్వాత జరిగిన ఒక సంఘటనను ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఇంటర్‌లో అడ్మిషన్ అప్పుడు అప్లికేషన్‌లో స్వీటీ అని రాస్తే ముద్దు పేరు బావుంది.. కానీ, అసలు పేరు రాయాలని వారు అన్నారు. ఆ మయంలోనే పేరు మార్చాలని తమ తల్లిందడ్రులను కోరినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే, చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత సెట్‌లో ‘స్వీటీ’ అని పిలుస్తుంటే బాగోలేదని కొందరు సలహా ఇచ్చారట. దీంతో ఆమె తనకు తానే అనుష్క అని పేరు పెట్టుకుంది. అయితే, ఈ పేరు అందరికీ అలవాటు అయేందుకు సుమారు ఏడాది కాలం పట్టినట్లు ఆమె చెప్పంది.


