దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్ గో ఆన్ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్. బ్లాక్ మెడ్రాస్ ఫిలింస్ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్‌గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్ తిలక్, కల్లూరి వినో, రెడిన్ కింగ్‌స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మాస్క్ రిలీజ్
వెట్రిమారన్ మార్గదర్శకత్వంలో వికర్ణన్ అశోక్ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్ కథానాయకుడిగా నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్ 21న) తెరపైకి వచ్చింది.
అది హిట్టయితేనే..
ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్ చిత్ర హిట్‌పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట!


