‘ఇఫీ’లో కమల్‌హాసన్, సాయి పల్లవి, శివ కార్తికేయన్...
‘‘స్వతంత్ర సినిమా స్వతంత్రంగానే ఉంటుంది. దాన్ని వాణిజ్య సినిమాలతో పోల్చి పరిమితుల్లో పెట్టకండి. స్వతంత్ర సినిమా కూడా స్వతంత్ర భారత్ లాగే స్వేచ్ఛగా ఉంటుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్ తెలిపారు. గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) శుక్రవారం కమల్‌హాసన్ పాల్గొన్నారు. ‘ఇండిపెండెంట్ సినిమాలు ఇంకా థియేటర్లలో స్థానం సంపాదించుకోవడానికి పోరాడుతున్నాయి... థియేటర్లలో స్వతంత్ర సినిమాలకు సరైన ప్రదర్శన అవకాశాలు లభించడం లేదు కదా?’ అనే ప్రశ్నకు కమల్‌హాసన్ బదులిస్తూ– ‘‘అవును... ఇది నిజమే. గత 40 ఏళ్లుగా నేను లేవనెత్తుతున్న సమస్య ఇది’’ అని స్పష్టం చేశారు.
శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా కమల్‌హాసన్ నిర్మించిన ‘అమరన్’ చిత్రం ఈ ఏడాది భారతీయ పనోరమా విభాగంలో ప్రారంభ చిత్రంగా ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘అమరన్ ’ చిత్రం ‘ఇఫీ’లో ప్రదర్శనకు ఎంపిక కావడం, అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్ పీకాక్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘అర్ధంతరంగా ఆగి పోయిన ‘మరుదనాయగమ్’ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించే చాన్స్ ఉందా?’ అనే ప్రశ్నకు కమల్ బదులిస్తూ– ‘‘ప్రస్తుత సాంకేతిక విప్లవ యుగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా ఆ చిత్రం పూర్తి కావచ్చుననే ఆశాభావం ఉంది’’ అన్నారు.
మాస్టర్ క్లాసెస్ ప్రారంభం
‘ఇఫీ’లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్‌క్లాస్ సిరీస్‌ను శుక్రవారం కేంద్ర సమాచార– ప్రసారశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. ఎల్. మురుగన్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ముజఫర్ అలీ మాస్టర్‌క్లాస్ సిరీస్‌లో తొలి సెషన్‌ను నిర్వహించారు.
సినీ ప్రముఖులతో క్లాసెస్...
ఈ మాస్టర్‌క్లాస్ విభాగంలో ఫ్యానల్ డిస్కషన్లు, వర్క్‌షాపులు, రౌండ్‌టేబుల్ ఇంటరాక్షన్లు, ఇంటర్వ్యూ సెషన్లు, ఫైర్‌సైడ్ చాట్స్ వంటి వర్క్‌షాపులు ఉంటాయి. భారతీయ సినీ ప్రముఖులు విధు వినోద్ చోప్రా, అనుపమ్ ఖేర్, షాద్ అలీ, శేఖర్ కపూర్, రాజ్‌కుమార్ హిరానీ, ఆమిర్ ఖాన్, విశాల్ భరద్వాజ్, సుహాసినీ మణిరత్నం వంటి వారు ఈ ఫెస్టివల్‌లో వివిధ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా కృత్రిమ మేథ (ఏఐ) మనుగడ, సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, ఎస్‌ఎఫ్‌ఎక్స్ వంటి సాంకేతిక విభాగాలపై ప్రత్యేక వర్క్‌షాపులను ప్లాన్ చేశారు. రంగస్థల నటనపై ప్రముఖ నిపుణులు అందించే మాస్టర్‌క్లాస్‌లు కూడా జరగనున్నాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి


