సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్‌ | Allu Arjun Press Meet About Sandhya Theatre Issue | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్‌

Dec 21 2024 6:08 PM | Updated on Dec 21 2024 8:43 PM

Allu Arjun Press Meet About Sandhya Theatre Issue

పుష్ప2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మరణించడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. సినీ హీరో అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా బన్నీ మీడియాతో మాట్లాడారు. అయితే, సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా పరోక్షంగా బన్నీ కౌంటర్‌ ఇచ్చారు.
 

'సంధ్య థియేటర్‌ ఘటన ప్రమాదవశాత్తుగా మాత్రమే జరిగింది. ​కానీ, నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే. నేను ఎలాంటి ర్యాలీ చేయలేదు. థియేటర్‌ లోపలికి నేను వెళ్లిన తర్వాత ఏ పోలీస్‌ లోపలికి వచ్చిన జరిగిన సంఘటన గురించి చెప్పలేదు. థియేటర్‌ యాజమాన్యం వచ్చి, జనాలు ఎక్కువగా ఉన్నారని చెప్పడంతో  బయటకు వచ్చేశాను. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన విషయం ఆ క్షణంలో నాకు తెలియదు. మరుసటి రోజు రేవతి విషయం తెలిసింది. 

నా సినిమా కోసం వచ్చిన ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసి కూడా ఎలా వెళ్లిపోతాను..? నాకూ పిల్లలు ఉన్నారు కదా. మరుసటి రోజు నా టీమ్‌ వారికి ఫోన్‌ చేసి వెంటనే ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను.  సినిమాకు వచ్చేవారిని ఆనందపరచాలనేది మా ఉద్దేశం.నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. 20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. ఇంతవరకు నేను ఎవరినీ ఒకమాట అనలేదు. అనుమతి లేకుండా థియేటర్‌కు వెళ్లాను అనడంలో ఎలాంటి నిజం లేదు. రేవతి కుటుంబం విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించానని చెప్పడం చాలా దారుణం. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను రోడ్‌ షో, ఊరేగింపు చేయలేదు. మూడేళ్లుగా సినిమా కోసం చాలా కష్టపడ్డాను. అభిమానులతో సినిమా చూడాలని ఆశతో వెళ్లాను. 

గతంలో ఇతర హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది నా  అభిమానులు చనిపోతే.. ఆ కుటుంబాన్ని వెళ్లి కలవకుండా ఎలా ఉంటాను. లాయర్ల సూచనలతో నేను శ్రీతేజను చూసేందుకు వెళ్లలేదు. అయితే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి స్పెషల్‌ అనుమతి తీసుకుని, మా నాన్నను వెళ్లమని చెప్పాను. కానీ, అదీ కుదరదన్నారు. అయితే, సుకుమార్‌ను  అయినా వెళ్లమని చెప్పాను. అదీ కాదన్నారు. నేను ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని చెప్పడం చాలా దారుణం.  నా క్యారెక్టర్‌ను చాలామంది తక్కువ చేసి మాట్లాడుతుంటే  మాత్రం మనసుకు తీసుకోలేకపోతున్నా. అంతటి ఘోరం జరిగిందని నాకు తెలిస్తే.. నా బిడ్డలను థియేటర్‌ వద్దే వదిలి ఎలా వెళ్తాను. పూర్తి విషయాలు తెలుసుకోకుండా నాపైన నిందలు వేస్తున్నారు. నేను కూడా ఒక తండ్రినే.. నాకు శ్రీతేజ వయసు ఉన్న అబ్బాయి ఉన్నాడు. ఆ బాధ ఏంటో నాకు తెలుసు.


తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శాంతి భద్రతల సమస్య వస్తుందని.. థియేటర్‌ నుంచి వెళ్లిపోవాలని ఏసీపీ చెప్పినా కూడా   సినిమా చూసే వెళ్తానని అల్లు అర్జున్‌ అన్నట్టు తెలిసిందని రేవంత్‌రెడ్డి అన్నారు. పోలీసులు ఎదోరకంగా అల్లు అర్జున్‌ను అక్కడి నుంచి పంపిస్తే.. అయినప్పటికీ, మరోసారి రూఫ్‌టాప్‌ ద్వారా చేతులు ఊపుతూ వెళ్లారని కామెంట్‌ చేశారు. ఒక మహిళ చనిపోయిందని తెలిసి  ఆపై ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా కూడా అల్లు అర్జున్‌ అదే పద్ధతి కొనసాగించారనే సంచలన ఆరోపణ రేవంత్‌రెడ్డి చేశారు. ఒక మహిళ చనిపోయాన కూడా ఆయన సినిమా చూసే వెళ్తానని అనడం ఏంటి అంటూ బన్నీ తీరుపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement