
ముందుగా ప్లాన్ చేసుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారిలో అజిత్ (Ajith Kumar) ఒకరు. అనుకోకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమిళంలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. ఈ మధ్యే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఆయన హఠాత్తుగా సినిమాలను ఎప్పుడు వదిలేసేది కూడా తెలీదంటున్నారు.
రిటైర్ అవొచ్చేమో..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. 'ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలీదు. రిటైర్‌మెంట్ నేను ప్లాన్ చేసుకోవాల్సిన పని లేదు. బలవంతంగా కూడా రిటైర్ అయిపోవచ్చేమో! చెప్పలేం.. ఈరోజుకు మనమింకా బతికున్నామన్నదే పెద్ద ఆశీర్వాదంలా భావించాలి. నేనేం ఫిలాసఫీలు చెప్పడం లేదు. ఈ ప్రయాణంలో ఎన్నో దెబ్బలు తగిలాయి, అవి సర్జరీల వరకు కూడా వెళ్లాయి. ఇకపోతే నా ఫ్రెండ్స్, చుట్టాల్లో క్యాన్సర్‌ను జయించినవాళ్లు కూడా ఉన్నారు.
కాలాన్ని వృథాగా పోనివ్వను
జీవితం ఎంత విలువైనదో మాకు బాగా తెలుసు. అందుకే ఈ లైఫ్‌లో ప్రతి సెకనును వృథాగా పోనివ్వదల్చుకోలేదు. వీలైనంతవరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటాను. సినిమాల్లోకి రావాలని నేనెన్నడూ అనుకోలేదు. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. స్కూల్ అయిపోయాక ఆటోలు తయారుచేసే కంపెనీలో ఆరు నెలలు పని చేశాను. 18 ఏళ్ల వయసులో రేసింగ్ మొదలుపెట్టాను. ఆ తర్వాత వాణిజ్య ప్రకటనలు చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను' అని చెప్పుకొచ్చారు. అజిత్ చివరగా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సినిమాతో మెప్పించాడు. ఈ మూవీ కేవలం రెండు వారాల్లోనే రూ.200 కోట్లు రాబట్టింది.
చదవండి: గలీజ్ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి