ఒకే ఫ్రేమ్‌లో ఐశ్వర్య రాయ్‌ కుటుంబం.. ఆ ఒక్కరు మాత్రం లేరు | Sakshi
Sakshi News home page

భర్తకు సపోర్ట్‌గా అక్కడకు వచ్చేసిన ఐశ్వర్య రాయ్‌.. రూమర్స్‌కు చెక్‌

Published Sun, Jan 7 2024 8:00 PM

Aishwarya Rai And Abhishek Bachchan Family Scene One Frame - Sakshi

బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్ కుటుంబానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి కుటుంబం నుంచి ఎన్నో ఊహాగానాలు వచ్చినా వారు మరింత రెట్టింపుతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. తాజాగా ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కబడ్డీ మ్యాచ్‌కు జయ బచ్చన్ మినహా ఆ కుటుంబం మొత్తం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ కబడ్డీ మ్యాచ్‌లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. వీరంతా అభిషేక్ బచ్చన్‌కు చెందిన జైపూర్ పింక్ పాంథర్స్ జట్టును ఉత్సాహపరిచేందుకు అక్కడికి వచ్చారు.

ప్రొ కబడ్డీ లీగ్ (పికెఎల్) సీజన్ 10 మ్యాచ్‌లో ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆ జట్టు యు ముంబాను ఓడించింది. ఆ మ్యాచ్‌లో సందడిగా కనిపించిన బచ్చన్‌ కుటుంబాన్ని స్టార్ స్పోర్ట్స్  వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బచ్చన్ కుటుంబ సభ్యులు అందరూ జైపూర్ పింక్ పాంథర్స్ షర్టులు ధరించి వచ్చారు. యు ముంబా జట్టుతో జైపూర్ పింక్ పాంథర్స్ గట్టి పోటీనిచ్చింది. యు ముంబా జట్టును ఓడించడంతో, బచ్చన్ కుటుంబం లేచి నిలబడి చప్పట్లు కొడుతూ కనిపించిన ఆ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ జట్టు 2014 నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌లో పోటీ చేయడం ప్రారంభించింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో యు ముంబా జట్టుపై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది.

అభిషేక్, ఐశ్వర్యల మధ్య మనస్పర్థలు వచ్చాయని వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా బాలీవుడ్‌లో వార్తలు వైరల్‌ అవుతున్నాయి.  అయితే బచ్చన్ కుటుంబ సభ్యులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ పనుల్లో బిజీగా ఉన్నారు. పలు ప్రోగ్రామ్స్‌లో కలిసి కనిపిస్తూ రూమర్లకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అమితాబ్‌ ఇంటి నుంచి ఐశ్వర్య బయటకు వచ్చేసిందని దీనంతటికి కారణం తన అత్తగారు జయా బజ్చన్‌, అమితాబ్‌ బచ్చన్‌ అంటూ వార్తలు వచ్చాయి. ప్రస్తుతం బచ్చన్‌ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఒకే చోట కూర్చొని ఆనందంగా గడిపారు. ఇకనైన ఈ వార్తలకు చెక్‌ పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 
Advertisement
 
Advertisement