
బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show)కి ఉన్న క్రేజే వేరు. గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, స్నేహాలు, ఆటలు, పాటలు, సరదా స్కిట్టులు.. ఇలా చాలానే ఉంటాయి. వినోదమంతా ఒక్కచోటే దొరికితే ప్రేక్షకులకు ఇంకేం కావాలి. అందుకే ప్రతి ఏడాది బిగ్‌బాస్ ఎప్పుడు మొదలవుతుందా? అని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. అటు బిగ్‌బాస్ టీమ్ కూడా.. జనాలను నిరాశపర్చకుండా ఉండేందుకు కంటెస్టెంట్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటుంది.
బిగ్‌బాస్ హౌస్‌లో AI రోబో
సింగర్, డ్యాన్సర్, మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యాంకర్, యాక్టర్, కొరియోగ్రాఫర్.. ఇలా వేర్వేరు ప్రొఫెషన్స్‌కు చెందినవారిని పార్టిసిపెంట్లుగా సెలక్ట్ చేస్తారు. ఆ మధ్య హిందీ బిగ్‌బాస్‌లో గాడిదను, శునకాన్ని తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఏఐ రోబోను బిగ్‌బాస్ హౌస్‌కు తీసుకొస్తున్నారంటూ ప్రచారం మొదలైంది. హిందీ బిగ్‌బాస్ 19వ సీజన్ కోసం ఈ రకంగా ప్లాన్ చేస్తున్నారట! ఈ విషయం తెలుసుకున్న జనాలు.. మరమనిషి హౌస్‌లోకి రావడమేంటని నోరెళ్లబెడుతున్నారు.
రోబో విశేషాలు
యూఏఈకి చెందిన ఈ రోబో పేరు హబుబు. దీనికి ఏడు భాషలు వచ్చు. అందులో హిందీ కూడా ఉంది. తను పాటలు పాడుకుంటూ ఇంట్లో పనులన్నీ చకచకా చేయగలదు. మనిషిలా భావోద్వేగాలు కూడా పలికించగలదు. ముఖానికి గోల్డెన్ కలర్ మాస్క్‌తో లెహంగాలో క్యూట్‌గా కనిపిస్తుంది. తను నిజంగా బిగ్‌బాస్ షోలో అడుగుపెడితే గేమ్ ఛేంజర్‌గా మారడం ఖాయం. తన స్పీడును కంటెస్టెంట్లు అందుకోవడం కష్టమే! మరి నిజంగా హబుబు రియాలిటీ షోలో భాగమవుతుందా? లేదా? అన్నది చూడాలి!
చదవండి: పాచిపని కూడా ఇవ్వట్లేదు.. ఈ బతుకొద్దనుకున్నా.. పాకీజా కన్నీళ్లు