Poonam Pandey: ఎంతకు తెగించావ్‌ పూనమ్‌? ఇక మారవా? | Sakshi
Sakshi News home page

పూనం పాండే: చచ్చిపోయానంటూ ప్రాంక్‌.. విమర్శలు, వివాదాలతోనే సావాసం!

Published Fri, Feb 2 2024 2:02 PM

Actress Poonam Pandey Controversial And Personal Life Story - Sakshi

బాలీవుడ్‌ సంచలన నటి పూనమ్‌ పాండే(32) గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూసిందంటూ మొదట్లో ఓ వార్త బయటకు వచ్చింది. పూనమ్‌ సొంత ఖాతాలోనే ఆమె మరణ వార్తను తెలియజేస్తూ పోస్ట్‌ ఉండటంతో అది నిజమే అనుకున్నారంతా! ఇంత చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండాయా? అని అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. కానీ అంతలోనే అందరికీ పెద్ద ఝలక్‌ ఇచ్చింది పూనమ్‌. కాంట్రవర్సీలు మనకు కొత్త కాదన్నట్లుగా బతికే ఉన్నానని చెప్పింది. క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించడం కోసం ఈ డ్రామా ఆడినట్లు తెలిపింది. అందరినీ బకరా చేసిన పూనమ్‌ జీవితంలోని విమర్శలు, వివాదాలు ఈ కథనంలో చూద్దాం..

వరల్డ్‌ కప్‌ సమయంలో మార్మోగిపోయిన పేరు
పూనమ్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించింది. ప్రతిభకు ఆత్మస్థైర్యం తోడవడంతో మోడలింగ్‌లో రాణించింది. తక్కువ కాలంలోనే ఓ ఫ్యాషన్‌ మ్యాగజైన్‌ కవర్‌ పేజీలో మెరిసింది. కానీ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవ్వాలనుకుందో ఏమో కానీ 2011లో సంచలన ప్రకటన చేసింది. వరల్డ్‌ కప్‌లో టీమిండియా గెలిస్తే మైదానంలో ఒంటి మీద దుస్తుల్లేకుండా తిరుగుతానని ప్రకటించింది. ఈ మాట విని ఆమెను తల్లి చితకబాదింది. అటు భారత్‌ వరల్డ్‌ కప్‌ సాధించింది.. కానీ ఆమె అలా బట్టల్లేకుండా తిరిగేందుకు బీసీసీఐ అనుమతించలేదు.

మాట నిలబెట్టుకోవడం కోసం..
అయినప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కొన్ని వారాల తర్వాత వాంఖడే స్టేడియంలో దుస్తుల్లేకుండా తిరిగిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఆ తర్వాతి ఏడాది కూడా ఇలాంటి పిచ్చి పనే చేసి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈమె తనకంటూ సొంతంగా ఓ యాప్‌ కూడా తయారు చేయించుకుంది. కానీ గూగుల్‌ దాన్ని బ్యాన్‌ చేసింది. తన ప్రేమ వ్యవహారం కూడా వివాదాలతోనే నడిచింది. ప్రియుడు సామ్‌బాంబే సన్నిహితంగా మెదిలిన క్షణాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో పూనమ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు వీడియోను ఆమె డిలీట్‌ చేయక తప్పలేదు.

భర్తతో గొడవలు, విడాకులు
2020 సెప్టెంబర్‌ 1న సామ్‌ బాంబేను పెళ్లాడింది పూనమ్‌. అప్పుడు కరోనా టెన్షన్‌ వల్ల ఈ వివాహాన్ని సింపుల్‌గా జరిపించారు. కానీ పెళ్లయిన పది రోజులకే పూనమ్‌.. భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్యాచార వేధింపులు, బెదిరింపుల కింద అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే భార్యాభర్తలిద్దరూ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా ఎన్నోసార్లు గొడవలు, కలిసిపోవడాలు తర్వాత చివరకు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాదిలో పోలీసులు పూనమ్‌నూ అరెస్ట్‌ చేశారు. గోవాలోని ప్రభుత్వ స్థలంలో అశ్లీల వీడియో చిత్రీకరించినందుకుగానూ జైల్లో పెట్టారు. పోర్నోగ్రఫీ కేసులో కూడా ఈమె పేరు ప్రధానంగా వినిపించింది.

సినిమాలు..
రియల్‌ లైఫ్‌లో బోల్డ్‌గా ఉండే పూనమ్‌ సినిమాలు కూడా ఆ జానర్‌లోనే చేసేది. అలా నషా సినిమాలో ఓ విద్యార్థితో సంబంధం పెట్టుకునే టీచర్‌లా కనిపించింది. పోస్టర్లలో అసభ్యత శృతి మించడంతో పెద్ద రచ్చే జరిగింది. హిందీలోనే కాకుండా భోజ్‌పురి, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో మాలిని అండ్‌ కో అనే మూవీ చేసింది.

'పెళ్లి చేసుకున్నాక టార్చర్‌ చూశాను. తల్లిదండ్రులూ ఏ కారణం లేకుండానే ఇంట్లో నుంచి గెంటేశారు. అందరూ కేవలం నన్ను డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. నన్ను తిట్టుకునేముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి' అని లాకప్‌ షోలో కన్నీటిపర్యంతమైంది నటి. కానీ ఇలా ఏకంగా చనిపోయానంటూ డ్రామాలాడితే ఎవరు మాత్రం తిట్టుకోరంటున్నారు జనాలు.

చదవండి: అనారోగ్యంతో బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి

Advertisement
Advertisement