అల్లు అర్జున్‌ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు! | Allu Arjun Takes Geetha Arts Business Plans | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ చేతికి గీతా ఆర్ట్స్.. కీలక మార్పులు!

Feb 9 2026 1:05 PM | Updated on Feb 9 2026 1:15 PM

Allu Arjun Takes Geetha Arts Business Plans

గీతా ఆర్ట్స్.. 1972లో అల్లు అరవింద్ స్థాపించిన అగ్రశ్రేణి చలనచిత్ర నిర్మాణ సంస్జ.. గీతా ఆర్ట్స్‌ పేరు వెనుక మహా నటుడు అల్లు రామలింగయ్య ఉన్నారు. భగవద్గీత సారాంశం నచ్చి ఆ పేరు పెట్టారు. గత ఐదు దశాబ్ధాలుగా వందల సంఖ్యలో ఈ బ్యానర్‌లో ఉపాధి పొందారు, పొందుతున్నారు. ఈ బ్రాండ్‌ కేవలం సినిమా రంగానికే పరిమితం కాలేదు. థియేటర్లు, పంపిణీ, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి కూడా విస్తరించింది.

గీతా ఆర్ట్స్ సంస్థను అల్లు అరవింద్ 50  సంవత్సరాల తరబడి కష్టపడి నిర్మించారు.  ఈ కంపెనీకి ఆయన కుమారులు అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ వారసులు ఉన్నప్పటికీ  గతంలో ఎవరూ రోజువారీ నిర్వహణలో చురుకుగా పాల్గొనలేదు. వ్యాపార పనులన్నీ కూడా అల్లు అరవింద్‌నే చూసుకునేవారు. గీతా ఆర్ట్స్‌కు సంబంధించి ప్రతి విభాగంలో సమర్థులైన వ్యక్తులను నియమించుకోవడంతో  అల్లు అరవింద్ సక్సెస్‌ అయ్యారు. దీంతో వ్యక్తిగతంగా ప్రతిపనిలో వారి అవసరం అంతగా కనిపించలేదని చెప్పాలి. ఆపై వారి ఫ్యామిలీ మెంబర్‌, చిరంజీవి తోడల్లుని కుమార్తె  విద్య ఈ నిర్మాణ సంస్థలో కీలక పాత్ర పోషించడంతో ఎలాంటి ఇబ్బంది కలగలేదు.

అల్లు అరవింద్‌ స్థాపించిన వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా ఇప్పుడు  అల్లు అర్జున్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గీతా అర్ట్స్‌కు సంబంధించి పలు నిర్ణయాలను ఆయన తీసుకున్నట్లు తెలుస్తోంది. అతను మొత్తం స్థాయిలో సంస్థను పర్యవేక్షిస్తున్నారు. రోజువారీ చర్చలకు బదులుగా తరచూ సమీక్ష సమావేశాలు, ప్రణాళికలతో పాటు వ్యాపార అభివృద్ధికి సంబంధించిన ప్రధాన నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటున్నారని టాక్‌.. గీతా అర్ట్స్‌లోకి బన్నీ ప్రవేశం తర్వాత, కొన్ని మార్పులు జరిగినట్లు సమాచారం. 

తమ సంస్థలో చాలా కాలంగా పనిచేస్తున్న సహచరులకు సరైన గౌరవం ఇస్తూనే  యువ టాలెంట్‌ను కూడా సంస్థలోకి తీసుకువచ్చారట. 50 ఏళ్లుగా వ్యాపారంలో బిజీగా గడిపేసిన అల్లు అరవింద్‌కు ఇప్పుడు కాస్త ఉపశమనం లభించినట్లు టాక్‌. అల్లు అర్జున్‌ ఎంట్రీ ఇప్పటికే ఆలస్యమైనప్పటికీ, తన తండ్రి  నిర్మించిన వ్యాపారా సామ్రాజ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బలమైన నిర్ణయాలే బన్నీ  ముందుకు రావడం  సానుకూల చర్యగా విశ్లేషకులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement