
బాలీవుడ్ నటి హుమా ఖురేషి (Huma Qureshi) బంధువు దారుణ హత్యకు గురైయ్యారు. ఆమెకు సోదరుడి వరుస అయ్యే ఆసిఫ్ ఖురేషీని ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో దాడిచేసి చంపేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తన నివాసం వద్ద పార్కింగ్ విషయంలో ఇద్దరు యువకులు అతనిపై గొడవకు దిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'ఆసిఫ్ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పార్కింగ్ చేశారు. దీంతో వాహనాలను తొలగించాలని ఆసిఫ్ కోరడంతో వారిద్దరూ గొడవకు దిగారు. ఇరువురి మధ్య వివాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితులు పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. దాడి తర్వాత, ఆసిఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.' అని పేర్కొన్నారు.
ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఇదే పార్కింగ్ విషయంలో వారిద్దరు తనతో గొడవ పడ్డారని ఆమె చెప్పింది. గురువారం రాత్రి ఆఫీస్ నుంచి తన భర్త ఇంటికి వచ్చాడని ఆ సమయంవలో ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉన్న ద్విచక్ర వాహనాన్ని తొలగించాలని కోరినందుకు గొడవకు దిగారని ఆమె తెలపింది. అయితే, పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
హుమా ఖురేషి నటిగా, నిర్మాతగా, రచయితగా కూడా రాణిస్తున్నారు. కాలా, వలిమై,జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రాలతో పాటు మహారాణి వెబ్ సిరీస్‌లలో నటించి తెలుగువారికి కూడా బాగా పరిచయం అయింది.