
ఎవరైనా, ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి చేరుకున్నారంటే దాని వెనుక వారి శ్రమ, కృషి, అంకితభావం ఉంటుంది. అలా సినీ రంగంలో నిరంతర శ్రమ, పట్టుదలతో శ్రమించి సాధించిన వారు ఎందరో ఉన్నారు. అయితే, అలాంటి వారు తమ రంగంలో సాధించిన తరువాత అక్కడితో ఆగకుండా, ఇతర రంగాలతో పాటు రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు. ఆవిధంగా సాధించిన వారూ ఉన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి వారు సినిమా రంగంలో అశేష ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని ,రాజకీయరంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రులుగానూ ప్రజాదరణ పొందారు. ఆ తరువాత కమలహాసన్, విజయకాంత్ వంటి వారు రాజకీయ రంగప్రవేశం చేసి ప్రజల్లో ఉన్నారు. ఇక రజనీకాంత్ ఆ ప్రయత్నం చేసినా, ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో రాణించడానికి రంగంలోకి దిగారు. ధనుష్ కూడా అదే దారిలో అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్, విజయ్ వంటి నటుల బాటలో ధనుష్ పయనించనున్నారు. అవును తన అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగి ఉత్సాహపరచడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. అందులో భాగంగా గత వారమే ధనుష్ తన అభిమానులను కలుసుకోవలసి ఉంది. అందుకు స్థానిక సాలిగ్రామంలో ఒక స్టూడియోను కూడా 25 వారాల పాటు వారానికి ఒక్క రోజు(ఆదివారాల్లో మాత్రమే ) అభిమానులను కలుసుకునే విధంగా బుక్ చేసినట్లు తెలిసింది.
నిజానికి గత వారమే ధనుష్ అభిమానులను కలుసుకోవలసి ఉందనీ, అయితే ఆయన కాలికి దెబ్బ తగలడం వల్ల ఆ వారం వాయిదా పడిందని సమాచారం. కాగా ఈ నెల 27వ తేదీ నుంచి ప్రతివారం 500 మంది అభిమానులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిసింది. ఇలా అభిమానులను కలవాలన్న ధనుష్ సంచలన నిర్ణయం వెనుక రాజకీయ కోణం ఏదైనా ఉందా అనే చర్చ కోలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. గతంలో రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్ వంటి వారు మొదట అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టి వారితో మరింత దగ్గరయ్యాకనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.