
దేశంలోని అత్యంత ధనిక నటుల్లో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ఒకరు. ఒకానొక సమయంలో భారత్‌లో అత్యధిక మొత్తంలో ఆదాయ పన్ను చెల్లించి వార్తల్లోకెక్కాడు. నిజాయితీగా ట్యాక్స్ కట్టినందుకుగానూ ఆదాయపన్నుశాఖ ఆయనకు ప్రశంసాపత్రాన్ని సైతం అందించింది. అయితే అక్షయ్‌కు డబ్బుపిచ్చి ఉందన్న ప్రచారం జరిగింది. తాజాగా ద కపిల్ శర్మ షోకి హాజరైన అక్షయ్ మనీ మైండెడ్ అని తనపై పడిన ముద్రపై స్పందించాడు.
రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేస్తే..
హీరో మాట్లాడుతూ.. జితేంద్ర సాహెబ్ రూ.100 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకున్నాడని నేను ఎక్కడో వార్త చదివాను. నాకు బాగా గుర్తు.. అది చూశాక నేను మా నాన్న దగ్గరకు పరుగెత్తుకెళ్లాను. డాడీ, రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది? అని అడిగాను. అప్పట్లో ఇంట్రెస్ట్ రేట్ 13% ఉండేది. ఈ లెక్కన నెలకు రూ.1.3 కోట్లు అన్నాడు. అంటే నేను రూ.100 కోట్లు ఎఫ్‌డీ చేసుకోగలిగితే నాకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్లే అని ఫీలయ్యాను.
ఆశకు హద్దు లేదు
కానీ మనషుల ఆశకు అంతెక్కడిది? రూ.100 కోట్లు కాస్తా వెయ్యి కోట్లయితే బాగుండు.. వెయ్యెందుకు? రూ.2 వేల కోట్లయితే బాగుంటుంది అనుకునేవాడిని. అలా మనలో డబ్బు ఆశకు అంతం లేదు అన్నాడు. మరి ఇప్పటివరకు ఎంత ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశావు? అని కపిల్ అడగ్గా.. అది నేను చెప్పనుగా అని తప్పించుకున్నాడు అక్షయ్.
8 ఏళ్లుగా నేనే..
ఆప్‌కీ అదాలత్ షోకి వెళ్లినప్పుడు కూడా అక్షయ్‌కు డబ్బు గురించే ప్రశ్న ఎదురైంది. అందుకీ బాలీవుడ్ స్టార్.. నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను తప్ప ఎవరినీ దోపిడీ చేయడం లేదు కదా.. గత 8 ఏళ్లుగా ప్రభుత్వానికి నేనే ఎక్కువ ట్యాక్స్ కడుతున్నాను. అలా అని నేను మనీ మైండెడ్ అని అర్థం కాదు. బతకాలంటే డబ్బు అవసరం.
నేనేమైనా దొంగతనం చేస్తున్నానా?
నేను సంపాదిస్తున్నా.. ట్యాక్స్ కడుతున్నా, సేవ చేస్తున్నా.. సేవాగుణం నా మతం. అందరూ ఏమనుకుంటున్నారనేది నాకు అనవసరం. ఎవరైనా కార్యక్రమానికి రండి, డబ్బులిస్తాం అన్నారనుకోండి. తీసుకుంటే తప్పేంటి? మనమేం ఎవరి జేబులోనో చేయి పెట్టి దొంగిలించట్లేదు కదా! అని చెప్పుకొచ్చాడు. అక్షయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జానీ:LLB మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లు దాటేసింది.
చదవండి: ఆ ఒక్క పని వల్లే మనీష్ ఎలిమినేట్! రెండువారాల్లో ఎంత సంపాదించాడంటే?