
బిగ్‌బాస్ షో (Bigg Boss Telugu 9)లో రెండోవారం కూడా ఫ్లోరా సేవ్ అయింది. ఆ విషయం ఆమె కూడా నమ్మలేకపోతోంది. అందుకే నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున.. ఫ్లోరా సేవ్, మనీష్ ఎలిమినేట్ అనగానే ఏంటి? ఇది నిజమేనా? అని కొన్ని క్షణాలపాటు షాక్‌లో ఉండిపోయింది. ఆమెకే కాదు హౌస్‌మేట్స్‌కు కూడా ఇది పెద్ద షాకే! అందులోనూ కామనర్లకు మరీ పెద్ద షాక్!
తన గోతి తనే తవ్వుకున్న మనీష్
మనీష్ (Maryada Manish) ఎలిమినేషన్‌కు ఎవరూ కారణం కాదు, ఆయన స్వీయతప్పిదాలే తన కొంప ముంచాయి. హౌస్‌లో ఓవర్ థింకింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. కామనర్లను ఓనర్లను చేయగానే ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యాడు. కారణం లేకుండానే సెలబ్రిటీ రాము రాథోడ్‌ను ఈసడించుకున్నాడు, కసురుకున్నాడు. భరణిని సైతం అసహ్యంగా చూశాడు. అలాంటి వ్యక్తి పక్కన పడుకుంటే నాకు నిద్ర కూడా పట్టదు. నా బెడ్ షేర్ చేసుకోను అని భరణిని శత్రువును చూసినట్లే చూశాడు.
కన్నీళ్లు వృథా
ఓ గేమ్‌లో సంచాలక్‌గా వ్యవహరించి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ప్రియ, శ్రీజల వల్ల ఎక్కువ ఇబ్బందిపడింది మనీషే! మూలన కూర్చుని ఏడువుపో అని శ్రీజ అతడిని కూరలో కరివేపాకులా తీసిపడినా మాటలు పడ్డాడు, పక్కకెళ్లి ఏడ్చాడు, తప్ప ఆమెను నామినేట్ చేయలేదు. ప్రియ మానిటర్‌గా ఉంటే భోజనం కూడా చేయనని భీష్మించుకున్నాడు తప్ప ఆమెను కూడా నామినేట్ చేయలేదు.

కొంప ముంచిన నామినేషన్
వీళ్లిద్దరి వల్ల మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్న మనీష్.. నామినేషన్స్‌లో మాత్రం వాళ్లను వదిలేసి సెలబ్రిటీలను నామినేట్ చేయడం ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఈ డబుల్ స్టాండర్డ్స్ అతడిపై నెగెటివిటీని మరింత పెంచాయి. మనీష్ ఎలిమినేషన్‌కు ఇదే బలమైన కారణం! వాళ్లను నామినేషన్ చేసుంటే మనీష్ సేవ్ అవడంతో పాటు అతడి గ్రాఫ్ విపరీతంగా పెరిగుండేది. ఇకపోతే మనీష్.. ఇంగ్లీష్ దొరలా ఎప్పుడూ ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉండేవాడు. లైవ్‌లో అయితే మరీ దారుణంగా తెలుగు తప్ప ఇంగ్లీషే మాట్లాడేవాడు.
రెమ్యునరేషన్ ఎంత?
ఈ విషయంపై బిగ్‌బాస్ నుంచి వార్నింగ్స్ కూడా వచ్చాయి. తెలుగు రాని ఫ్లోరా, సంజనాయే చక్కగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే మనీష్ మాత్రం మహామేధావిలా ఇంగ్లీష్‌లోనే ఎందుకు వాగుతాడన్న అసహనం కూడా జనాల్లో ఉంది. ఇలా తను చేసిన తప్పులకు భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండోవారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. కామనర్లందరికీ దాదాపు రూ.70-80 వేలు ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మనీష్ రెండు వారాలకుగానూ లక్షన్నర సంపాదించాడన్నమాట!
చదవండి: నా భర్తతో బిగ్‌బాస్ రీతూ ఎఫైర్.. వీడియో విడుదల చేసిన నటుడి భార్య