
50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న ఏకై క నటుడు రజనీకాంత్. 1975లో అపూర్వరాగంగళ్ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన రజనీ తాజాగా నటించిన కూలీ చిత్రంతో కథానాయకుడిగా 50 వసంతాలను పూర్తిచేసుకున్నారు. 50 ఏళ్లలో తమిళం, తెలుగు ,హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 171 చిత్రాలు చేశారు. ఈయన నటుడిగా 50వ వసంతంలో నటించిన చిత్రం కూలీ. దీంతో రజనీకాంత్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, పళణిసామి, శశికళ, ఎంపీ కమలహాసన్, దినకరన్‌ల వరకు పలువురు అభినందనలు తెలిపారు.
కాగా రజనీకాంత్ తాజాగా నటించిన కూలీ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, క్రేజీ స్టార్ శ్రుతిహాసన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని బుధవారమే చూసిన సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి, పలువురు రాజకీయ ప్రముఖులు చూసి బాగుందంటూ ప్రశంసించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన కూలీ చిత్ర రిజల్ట్ మాట అటు ఉంచితే రజనీకాంత్ అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. థియేటర్ల ముందు బ్యాండ్ బాజాలు, డాన్స్‌లతో కోలాహలం సృష్టించారు. ఆగస్టు 15 ముందు రోజునే విడుదలైన కూలీ చిత్రం ఆదివారం వరకు నాలుగు రోజులు వసూళ్లను ఇరగదీస్తుందని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రంలో దమ్మును బట్టి కలెక్షన్ ్స ఉంటాయి.