● మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మునిపల్లి(అందోల్): మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ్మ ఆకాంక్షించారు. మండల కేంద్రమైన మునిపల్లి, రాయికోడ్ మండలాల్లోని 1,213 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగులు, గీత కార్మికులకు చేయూత పింఛన్లతో జీవనోపాధి కోసం భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. రోజు రోజుకు ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల పాటు వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. కంకోల్ ఆస్పత్రి త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో సుమారు రూ.2 వేల కోట్లతో అన్ని మండలాల్లోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు మంత్రి వెల్లడించారు. రూ.100 కోట్లతో బుదేరా నుంచి రాయికోడ్ మండలం సీరూర్ గ్రామం వరకు రోడ్డు, తక్కడపల్లి బ్రిడ్జి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ పాండు, అదనపు డీఆర్‌డీఏ రాజేందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ నాగారం గొల్ల అంజయ్య, నియోజకవర్గ అధికారి పాండు, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, రాయికోడ్ ఏఎంసీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మునిపల్లి సర్పంచ్ రాజగోని సౌందర్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ కో ఆప్షన్ సభ్యుడు గౌస్
పాపన్నపేట(మెదక్): అవమానాలు భరిస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనందున, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పాపన్నపేట మాజీ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ గౌస్ ప్రకటించారు. మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో చేరితే, కనీస గుర్తింపు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధి కోసం, అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశామన్నారు. అయినా స్థానిక పార్టీ నాయకులు ఎమ్మెల్యే రోహిత్‌రావు వస్తున్న సమాచారాన్ని కూడా ఇవ్వడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని కాంగ్రెస్ అధినాయకులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ అవమానాలు భరించలేక కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నట్లు స్పష్టం చేశారు.
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి గోమారం గ్రామంలో గతంలో రద్దు చేసిన సహకార సంఘాన్ని తిరిగి పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను మంగళవారం నర్సాపూర్ ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ మాధవరెడ్డి, సర్పంచ్ హైమావతి వివరించారు. గోమారంలో సహకార సంఘాన్ని పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావ్‌కు ఇందుకు కృషి చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి రాజిరెడ్డికి కాంగ్రెస్ నాయకులు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.


