ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ కృషి

Nov 18 2026 11:01 AM | Updated on Nov 18 2026 11:01 AM

● గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌ పేదలను పట్టించుకోలేదు

● ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌

చిన్నశంకరంపేట(మెదక్‌)/నిజాంపేట(మెదక్‌)/పాపన్నపేట(మెదక్‌)/రామాయంపేట(మెదక్‌)/మెదక్‌జోన్‌: ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ స్పష్టం చేశారు. చిన్నశంకరంపేట, నార్సింగి, పాపన్నపేట మండల కేంద్రాల్లో, నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అధికారం ఇస్తే అప్పులు చేసి అందినకాడికి దోచుకున్నారే తప్ప పేదలను పట్టించుకోలేదన్నారు. ఇళ్లు, రేషన్‌ కార్డులు, ఫించన్ల కోసం పేదలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసినా ఫలితం దక్కలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బస్సు, ఉచిత విద్యుత్‌ నుంచి మొదలుకుని రేషన్‌కార్డులు, ఇందిరమ్మ, నూతన చేయూత పింఛన్లను అందించి కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచిందన్నారు. అభివృద్ధిలోనూ మెదక్‌ నియోజవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల, మెదక్‌ చర్చి, మెడికల్‌ కాలేజీ, ఇంటిగ్రేటేడ్‌ స్కూల్‌ అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. మున్ముందు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతే

గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అరాచకం రాజ్యమేలాయని రోహిత్‌రావు ఆరోపించారు. రామాయంపేటలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకమైన యంగ్‌ ఇండియా స్కూల్‌ మంజూరు చేయించామని పట్టణంలో సర్కిళ్ల సుందరీకణ పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. రామాయంపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మెదక్‌ పట్టణంలోని మూడు చౌరస్తాల సుందరీకరణతోపాటు ప్రతీ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణాలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించినట్లు చెప్పారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట, నార్సింగి ఎంపీడీఓలు దామోదర్‌, తిరుపతి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మోహన్నాయక్‌, రాజేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌, జిల్లా ఫోరం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement