మంజీరా.. కాలుష్య ధార | - | Sakshi
Sakshi News home page

మంజీరా.. కాలుష్య ధార

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

12 మి.గ్రా.కు చేరిన బీఓడీ

సంగారెడ్డి నుంచి పాపన్నపేట వరకు ప్రమాదకర స్థాయిలో..

ఫ్యాక్టరీలు, చేపల చెరువులతో కాలుష్యం

తాగునీరు, పంటలు, పశు సంపదకు

తీవ్ర ముప్పు

పాపన్నపేట(మెదక్‌): పవిత్రమైన మంజీరా.. మురికి కూపంగా మారుతోంది. జీవకోటికి ప్రాణా ధారం కావాల్సిన జలం విషతుల్యంగా మారింది. 12 మి.గ్రా ఓబీడీతో రాష్ట్రంలోనే అత్యధిక కలుషిత నదిగా ప్రమాద ఘంటికలు మోగిస్తుంది. పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే విషపు నీరు, చేపల చెరువుల వ్యర్థాలు, సంగారెడ్డి–పాపన్నపేట వరకు సాధారణ బీఓడీ కంటే మూడు రెట్లు అత్యధికంగా ఉండటంతో తాగునీరు, పంటలు, పశుసంపద, జలచరాలతో పాటు మానవ ఆరోగ్యానికి ముప్పు గా పరిణమించింది.

మెతుకుసీమ వరప్రదాయిని

మహారాష్ట్రలో జన్మించే మంజీరా.. మెతుకుసీమకు ప్రాణాధారం. ఈ నదిపై సింగూరు, ఘనపూర్‌ ప్రా జెక్టులు నిర్మించారు. హైదరాబాద్‌ జంటనగరా లతో పాటు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలకు తాగు నీరు అందించేందుకు మంజీరా బ్యారేజీ, మిషన్‌ భగీరథ పథకాలకు రూపకల్పన చేశారు. సింగూరు కాల్వల కింద 40 వేలు, ఘనపురం ఆనకట్ట కింద 30 వేల ఎకరాల పంటలకు సాగు నీరు అందిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మంజీరను మెతుకుసీమ వరప్రదాయినిగా చెప్పొచ్చు. జిల్లాలో సింగూరు నుంచి సుమారు 135 కి.మీ మేర మంజీరా ప్రవహిస్తుంది.

కాలుష్య కారకాలేంటి!

మంజీరా నదిలో కలిసే వాగులు, పరిశ్రమల్లో శుద్ధి చేయని వ్యర్థాలు, మానవ వినియోగిత వ్యర్థ మలినాలు, చేపల చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలు, అధిక రసాయనిక ఎరువులు వినియోగించడం వల్ల పొలాల నుంచి వచ్చే నీరు, ప్లాస్టిక్‌, పూజ సామగ్రి, విగ్రహాల నిమజ్జనం తదితర కారకాల వల్ల మంజీరాలో కాలుష్యం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, మనూర్‌, రాయికోడ్‌, న్యాల్‌కల్‌, హత్నూర మండలంలో ఉన్న అనేక చేపల చెరువుల వ్యర్థాలు మంజీరాలో కలవడం వల్ల నీటిలో బీఓడీ పెరుగుతుందన్న ఆరోపణలున్నాయి. ఇటీవల మూడు నెలల క్రితం నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన చేపల చెరువులను అధికారులు కూల్చివేశారని తెలిసింది. వీటిని ఎక్కువగా బఫర్‌ జోన్‌లోనే నిర్మించారు. ఈ చెరువులకు మంజీరా నది నీటిని అక్రమంగా వాడుకుంటూ వాటి వ్యర్థాలను తిరిగి నదిలోకే వదలడం వల్ల మంజీరా కలుషితమవుతోంది. ఈ నీటి వినియోగం వల్ల తాగునీరు, వ్యవసాయ పంటలు కలుషితం కావడంతో మానవ ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది. పశుసంపద, జలచరాలకు గ్రామీణ జీవనోపాధికి ముప్పుగా మారుతుంది.

మురికి కూపంగా మారి ‘నది’

కాలుష్య కోరల్లో నది

కేంద్ర కాలుష్య నివేదిక ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం.. మంజీరా నది కాలుష్య కోరల్లో చిక్కుకున్నట్లు స్పష్టం చేసింది. నదీ జలాల నాణ్యత నిర్ణయించే బయాలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) పరిమితి దాటుతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రకటించింది. సాధారణంగా 3 మి.గ్రా ఉండాల్సి బీఓడీ మంజీరా నదిలో 12 మి.గ్రాములకు చేరిందని ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్రంలోనే అత్యధికంగా 3 రెట్లతో నది ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు పేర్కొంది.

బాధ్యతగా వ్యవహరించాలి

మెదక్‌–సంగారెడ్డి జిల్లాల జనాలకు ఆధారం మంజీరా నది. ఇటీవల రాష్ట్ర పీసీబీ ఇచ్చిన నివేదిక ప్రకారం నదిలో ఓబీడీ 12 మి.గ్రాకు చేరింది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించి, కలుషిత వ్యర్థాలతో నదిలో కాలుష్యం పెరగకుండా చూడాలి. నదిలోకి కాలుష్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి జియో ట్యాగింగ్‌తో సమగ్ర కాలుష్య మ్యాపింగ్‌ రూపొందించాలి.

– లునావత్‌ జగన్నాథం, డీఈ, ఇరిగేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement