రేపు కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

రేపు కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి

Nov 15 2026 1:20 PM | Updated on Nov 15 2026 1:20 PM

అదనపు కలెక్టర్‌ నగేశ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్‌లో పిల్లల ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ నగేశ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 20 వరకు బాలల హక్కు ల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు తమ సమస్యలు, ఇబ్బందులు, ఫిర్యాదులు, అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజావాణి డెస్క్‌ ఏర్పాటు చేసి పిల్లల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వారికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన హక్కులతో కూడిన వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.

లైబ్రరీలతో విజ్ఞాన సముపార్జన

హవేళిఘణాపూర్‌(మెదక్‌): వారం రోజుల పాటు కొనసాగనున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థుల ప్రతిభను వెలికి తీసే కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి అన్నారు. శనివారం జిల్లా గ్రంథాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధికతో కలిసి వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. గ్రంథాలయాలు విద్యార్థులకు ఎంతో భవిష్యత్‌ను ఇస్తాయన్నారు. ఇక్కడ చదువుకున్న వారెందరో ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. లైబ్రరీల ద్వారా మేధావులు రచించిన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చన్నారు. నేటి ఆన్‌లైన్‌ యుగంలో మొబైల్‌లో వచ్చిన వార్తలు కాకుండా పుస్తకాలు చదివే అలవాటుతో మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. కార్యక్రమంలో లైబ్రేరీయన్‌ గణేశ్‌, రాజు, శ్రీనివాస్‌, మురళి, ఉమాదేవి, స్వామి, అర్చన, సిబ్బంది పాల్గొన్నారు.

భారత్‌ సమ్మిట్‌లో ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ భారత్‌ సమ్మిట్‌– 2026లో శనివారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 70 దేశాల నుంచి వెయ్యి మంది వరకు ప్రజాప్రతినిధు లు, విధాన రూపకర్తలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, మేధావులు సమ్మిట్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. దీని ద్వారా రాష్ట్రానికి ఉన్న అపారమైన పారిశ్రామిక, ఐటీ, వ్యవసాయ, విద్యా, వైద్యరంగాల సామర్థ్యాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు మార్గం సుగుమం కానుందని వివరించారు.

సింగూరు నుంచి

తాగు నీరు విడుదల

పుల్‌కల్‌(అందోల్‌): హైదరాబాద్‌ జంట నగరాల తాగునీటి కోసం సింగూరు నుంచి శనివారం నీటిని విడుదల చేశారు. 9 నంబర్‌ గేట్‌ను మీటరున్నర ఎత్తు ఎత్తి దిగువకు 0.15 టీఎంసీలు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 29.9 టీఎంసీలు కాగా, డ్యాంలో ప్రస్తుతం 2.3 టీఎంసీల నీటి నిల్వ ఉందని అధికారులు తెలిపారు. విడుదల చేసిన నీరు మంజీరా బ్యారేజ్‌ నుంచి జంట నగరాల తాగునీటికి వినియోగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement