జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు
● గతేడాదితో పోలిస్తే 3.64 మీటర్ల వ్యత్యాసం ● నార్సింగి మండలంలో 24 మీటర్లకు పడిపోయిన దై న్యం
జిల్లాలో భూగర్భజలాలు రోజురోజుకు వేగంగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా సరైన వర్షాలు కురవలేదు. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండలేదు. సెప్టెంబర్‌లో వర్షాలు ముఖం చాటేయటంతో సాగు చేసిన వరి పంటలకు బోరు బావుల ఆధారంగా నీటి తడులు అందించారు. దీంతో నీటి మట్టం ప్రమాదకరస్థాయికి పడిపోయింది. ఫలితంగా 11 మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇక నార్సింగి మండలంలో ఏకంగా 24 మీటర్ల లోతులో నీటి జాడలున్నాయి. మున్ముందు తాగు నీటికి కరువొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
– మెదక్‌జోన్
జిల్లాలో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్ర మే కురిశాయి. ఈ వానాకాలం జూన్, సెప్టెంబర్‌లో లోటు వర్షపాతం నమోదు కాగా జూలై, ఆగస్టులో సాధారణ వర్షం కురిసింది. నర్సాపూర్, మనోహరాబాద్, చిలప్‌చెడ్ మండలాల్లో మాత్రం లోటు వర్షపాతమే నమోదైంది. దీనికి తోడు జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటం, అందులో 2.94 ఎకరాల్లో వరి పండించారు. వర్షాలు అంతంత మాత్రమే పడటంతో రైతులు బోరుబావుల ఆధారంగా పంటలకు నీటి తడులు అందించారు. ఫలితంగా భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో భూగర్భజలాలు 7.84 మీటర్ల లోతులో ఉండగా, ప్రస్తుతం 11.48 మీటర్లకు చేరాయి. ఈలెక్కన గతేడాదితో పోలిస్తే అదనంగా 3.64 మీటర్ల లోతులోకి పడిపోయాయి. కేవలం నెలరోజుల వ్యవధిలో 1.8 మీటర్ల లోతుకు చేరాయి.
11 మండలాల్లో ప్రమాద ఘంటికలు
గతేడాదితో పోలిస్తే అన్ని మండలాల్లో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. చిలప్‌చెడ్, నార్సింగి, అల్లాదుర్గం, టేక్మాల్, పెద్దశంకరంపేట, మాసాయిపేట, నర్సాపూర్, పాపన్నపేట, కొల్చారం, రామాయంపేట, మనోహరాబాద్ మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇందులో అత్యంత ప్రమాదకరంగా నార్సింగి మండలంలో ఏకంగా 24.61 మీటర్ల లోతులోకి జలాలు అడుగంటి పోయాయి. రెండోస్థానంలో చిలప్‌చెడ్‌లో 21.82, మాడో స్థానంలో అల్లాదుర్గం మండలంలో 17.62 మీటర్ల లోతులోకి పడిపోయాయి. మిగితా 8 మండలాల పరిధిలో 13 నుంచి 15 మీటర్లలోతులోకి పడిపోయాయి. దీంతో ఈ మండలాల్లో ప్రత్యేకంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆయా మండలాల అధికారులకు ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.


