మరోవైపు ఆందోళన
జిల్లాలో నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇటీవల వైద్యారోగ్యశాఖ పరిధిలోని ఎన్‌హెచ్‌ఎం విభాగంలో 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా, వచ్చిన దరఖాస్తులే ఇందుకు నిదర్శనం. పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టుల కోసం అప్లికేషన్లు వెల్లువెత్తాయి. మొత్తం 64 కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ఏకంగా 2,062 దరఖాస్తులు రావడంతో కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఒక్కో పోస్టుకు సగటున 32 మందికి పైగా పోటీ పడుతున్నారు. – మెదక్ కలెక్టరేట్
ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న జిల్లాలో ఇప్పటివరకు సరైన సంస్థలు, కంపెనీలు కరువయ్యాయి. యువత పెద్ద పెద్ద చదువులు చదివినా సరైన ఉద్యోగావకాశాలు కరువయ్యాయి. జిల్లాలోని యువత హైదరాబాద్‌కు వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఇలాంటి సమయంలో ఏదో ఒక శాఖలో కాంట్రాక్ట్ పద్దతిన పోస్టులకు నోటిఫికేషన్లు వేస్తే వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇటీవల జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ విభాగంలో 64 పోస్టులు నోటిఫికేషన్ వేయగా 2,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సుమారు 32 చొప్పున అప్లికేషన్లు వచ్చినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు నెలల క్రితం జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు సందర్భంగా 156 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేయగా, సుమారు 8 వేలకు పైగా దరఖాస్తులు రావడం పెరుగుతున్న నిరుద్యోగానికి అద్ధం పడుతుంది.
పోస్టులు ఇలా..
జిల్లా వైద్యారోగ్యశాఖ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) విభాగంలో 64 పోస్టులలో స్టాఫ్ నర్స్ 31 ఉండగా, మొత్తం 855 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ 5 పోస్టులు ఉండగా 356, మెడికల్ ఆఫీసర్ (ఎంఎల్‌హెచ్‌పీసీహెచ్‌ఓ)10 పోస్టులకు 231, ఏఎన్‌ఎం–10 పోస్టులకు 381, ఫార్మసిస్టు 5 పోస్టులకు 239 ఇలా.. మొత్తం 64 పోస్టులకు 2,062 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 14తో ముగిసింది. అలాగే మెడికల్ కళాశాలలో ఉద్యోగాల కోసం ఆగస్టు నెలాఖరులో దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఇప్పటి వరకు ఎంపిక ప్రక్రియ చేపట్టకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. త్వరితగతిన ఉద్యోగాల భర్తీ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి గణేశ్వర్‌ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు, ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన బాట పట్టారు. జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 377 మంది ఇటీవల కలెక్టరేట్ ఎదుట వారం రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీరికి పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ఎన్‌హెచ్‌ఎంలో కాంట్రాక్టు ఉద్యోగాలకు పోటీ తీవ్రం
64 పోస్టులకు 2,062 అప్లికేషన్లు
ఒక్కో పోస్టుకు సుమారు 32 మంది కాంపిటీషన్


