మెదక్‌లో కొనసా..గుతున్న సబ్‌స్టేషన్ నిర్మాణం
మెదక్‌జోన్: గతేడాది వచ్చిన భారీ వరదలకు పట్టణంలోని సబ్‌స్టేషన్ కొట్టుకుపోయింది. దాని స్థాన ంలో కొత్తది నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 2.1 కోట్లు మంజూరు చేసింది. మూడు నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉండగా, సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఏడాది గడిచినా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఫలితంగా పట్టణ ప్రజలకు ఇబ్బందు లు తప్పడం లేదు.
గడువు ముగిసి ఐదు నెలలు
జిల్లాలో గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. దీంతో పసుపులేరు వాగు పక్కన ఉన్న సబ్‌స్టేషన్ వాగులో కొట్టుకుపోయింది. దీంతో పట్టణంలోని పిల్లికొటాల్, డబుల్‌బెడ్రూం, ఆటోనగర్ ప్రాంతానికి సరఫరా అయ్యే విద్యుత్ నిలిచిపోయింది. పట్టణానికి సమీపంలోని రాజ్‌పల్లి సబ్‌స్టేషన్ నుంచి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాగా, వరదలకు కొట్టుకుపోయిన సబ్‌స్టేషన్ స్థానంలో నూతనంగా నిర్మించేందుకు రూ. 2.1 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ఓ కాంట్రాక్టర్ ఆన్‌లైన్ ద్వారా టెండర్ దక్కించుకున్నాడు. పట్టణంలోని మీరా కాలనీలో ఫిబ్రవరిలో సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించాడు. మూడు నెలల్లో (మే) వరకు పనులు పూర్తి చేయాల్సి ఉండగా, అక్టోబర్ పూర్తి కావొచ్చినా పనులు సా..గుతూనే ఉన్నాయి. ఇచ్చిన గడువు ముగిసి ఐదు నెలలు అదనంగా గడిచినా పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. దీంతో సంబంధిత అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు ఇప్పటికి మూడు సార్లు నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. అయినప్పటికీ పనులు మాత్రం నత్తతో పోటీ పడుతుండటం గమనార్హం. అలాగే పట్టణంలోని గాంధీనగర్‌లో మరో సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం మార్చిలో రూ. 2.1 కోట్లు కేటాయించారు. ఈ పనులు డిసెంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉండగా, పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇది పూర్తయితే గాంధీనగర్‌తో పాటు దాయరవీది తదితర ప్రాంతాలకు కరెంట్ సరఫరా చేయనున్నారు. కాగా, విద్యుత్ వినియోగం పెరగటం, ఉత్పత్తి తగ్గటంతో ఇక్కడ సైతం లోఓల్టేజీ సమస్య ఉత్పన్నం అవుతోంది.
తప్పని తిప్పలు
సబ్‌స్టేషన్ మునిగిపోవంతో దాని పరిధిలోని పిల్లికొటాల్, డబుల్‌బెడ్రూం, ఆటోనగర్ తదితర ప్రాంతాలకు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలోని రాజ్‌పల్లి సబ్‌స్టేషన్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. దీంతో లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఏర్పడింది. ఇళ్లలో ఫ్యాన్లు కూడా సరిగా తిరగలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది.
నిర్మాణంలో ఉన్న సబ్‌స్టేషన్
సదరు కాంట్రాక్టర్‌కు 3 సార్లు నోటీసులు
అయినా స్పందన కరువు
లో ఓల్టేజీతో తరుచూ అంతరాయం


