పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గమ్మకు పౌర్ణమి పురస్కరించుకొని ఆదివారం పల్లకీ సేవ నిర్వహించారు. దసరా తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడం, సెలవులు ముగియడంలో వేలాది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజామునే ఆమ్మవారిని గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బోనాలు తీసి, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి పల్లకీపై ఊరేగించారు.
నర్సాపూర్ రూరల్: ప్రధాని నరేంద్ర మోదీ 139వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని మండలంలోని ఎల్లారెడ్డిగూడ వార్డు సభ్యుడు, బూత్ అధ్యక్షుడు కోల శ్రీకాంత్ నివాసంలో బీజేపీ నాయకులు ఆదివారం వీక్షించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశ్‌గౌడ్, జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షుడు రాములు నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మన్ కీ బాత్ ద్వారా ప్రధాని మోదీ ప్రజలతో నేరుగా అనుసంధానమవుతూ స్ఫూర్తి నింపుతున్నారని కొనియాడారు.
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని చేగుంట మండలం వడియారంలో గల టీజీఎంఎస్ పాఠశాలలో కామన్‌లా అడ్మిషన్ టెస్ట్ (సీఎల్‌ఏటీ) కోచింగ్ కోసం ఐదుగురు పార్ట్‌టైం గెస్ట్ ఫ్యాకల్టీని నియమిస్తున్నట్లు డీఈఓ రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక గంట కోచింగ్ చేస్తే రూ.650 వేతనం ఇస్తామన్నారు. అభ్యర్థులు ఆంగ్ల మాధ్యమంలో పలు అంశాల్లో బోధన చేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 28 సాయంత్రం 4 గంటల వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
డీఈఓ రాజు
మెదక్ కలెక్టరేట్: ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణపై స్పెషల్ క్యాంపెయిన్‌లో అన్ని పాఠశాలలు భాగస్వాములు కావాలని డీఈఓ రాజు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 28న ఉదయం పాఠశాల అసెంబ్లీలో వ్యర్థాల నిర్వహణపై క్విజ్ నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఒక బ్లాక్ కలర్ డస్ట్‌బిన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఇంటి వద్ద ఉన్న పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, పాడైపోయిన కంప్యూటర్ విడిభాగాలు మొబైల్ చార్జర్లు ఈ డస్ట్‌బిన్‌లో వేసే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. పూర్తి సమాచారం కోసం జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి (8328 599157) నంబర్‌లో సంప్రదించాలన్నారు.
మెదక్ కలెక్టరేట్: మెదక్ డిపో నుంచి శ్రీశైలానికి డిలక్స్ బస్సుకు బదులు సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు డీఎం పరమేశ్వరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు మెదక్ డిపో నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. రిజర్వేషన్ చేసుకునేందుకు ఉదయం 6 గంటలకు 1944, మధ్యాహ్నం 12 గంటలకు 1964 నంబర్లలో సంప్రదించాలన్నారు. మెదక్ పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఎం సూచించారు.


