నర్సాపూర్ రూరల్: వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతని నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారిణి దివ్య అన్నారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ, కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జీవవైవిద్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వన్యప్రాణులు అడవుల్లో నివసించే జీవులు మాత్రమే కాదని, అవి సమగ్ర పర్యావరణ వ్యవస్థలో కీలకమైన భాగాలని వివరించారు. అడవుల నరికివేత, సహజ ఆవాసాల విధ్వంసం, అక్రమ వేట, కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్థాలు, వాతావరణ మార్పుల వంటి కారణాల వల్ల అనేక వన్యప్రాణులు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని వాపోయారు. ఇతర జీవుల మనుగడకు భంగం కలిగించే పనులు మనుషులు చేయకూడదన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సమీరా నజ్మీన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సురేశ్ కుమార్, అధ్యాపకులు రుక్మిణి, హేమంత్, రాజు, మహేందర్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


