● నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయండి
● కలెక్టర్ ప్రతిమాసింగ్
● విధుల్లో ఉన్న 15 రోజుల వేతనం కోత
● ఆగ్రహించిన ఉపాధ్యాయ, దళిత సంఘాల నాయకులు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి గృహ నిర్మాణ, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ...రెండో విడతలో ఇంకా మిగిలిన అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలన్నారు. మొదటి విడతలో మంజూరై నిర్మాణంలో ఉన్నవాటిని వేగంగా పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ ప్రతిమాసింగ్ వీడియో సదస్సు నిర్వహించారు. వైద్య సంస్థలు తప్పనిసరిగా నిబంధనలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో రోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ మాణిక్యం, జిల్లా వైద్యాధికారి జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈ,డిఈలు తదితరులు పాల్గొన్నారు.
అమిత్ షా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు
ఏర్పాట్లను పరిశీలించిన అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్
తూప్రాన్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న బ్రాహ్మణపల్లిలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులోభాగంగా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ ఐపీఎస్ గురువారం బ్రాహ్మణపల్లిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అమూల్ మిల్క్ బల్క్ యూనిట్ శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభా వేదిక, హెలీప్యాడ్, వీవీఐపీ కాన్వాయ్ మార్గాలను పరిశీలించి బందోబస్తుపై అధికారులతో సమీక్షించారు. పర్యటన సజావుగా జరిగేలా ముందస్తు భద్రతా చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సభకు వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బందోబస్తులో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్‌ఐలు, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, అమూల్ యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్నారు.
మహిళా టీచర్‌పై ఎంఈఓ వేధింపులు
చిన్నశంకరంపేట(మెదక్): స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఉపాధ్యాయురాలిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్న ప్రదేశం నుంచి మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లాలంటూ ఎంఈఓ పెడుతున్న వేధింపులు అఖిలపక్ష సమావేశం సాక్షిగా గురువారం బహిర్గతమయ్యాయి. గురువారం జరిగిన ఉపాధ్యాయ అఖిలపక్ష సమావేశంలో ఎంఈఓను సదరు మహిళా ఉపాధ్యాయురాలు నిలదీశారు. 15 రోజుల పాటు విధులు నిర్వహించినా వేతనంలో కోతపెట్టడంపై బాధిత టీచర్ కడిగిపారేశారు. తాను చెప్పుకోలేని విధంగా ఎంఈఓ వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు తరుచూ డిప్యూటేషన్ వేస్తూ కొంతకాలంగా వేధిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఇన్‌చార్జి ఎంఈఓ దీప్లారాథోడ్‌పై సదరు మహిళా టీచర్ డీఈఓకు ఫిర్యాదు చేశారు. అయితే తాను నిబంధనల ప్రకారమే వేతనంలో కోత పెట్టానని చెబుతూ సమావేశంలో నుంచి ఎంఈఓ బయటకు వెళ్లిపోయారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు, అక్కడికి చేరుకున్న దళిత సంఘాల నాయకులు ఎంఈఓ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా టీచర్‌ను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. మహిళ టీచర్‌కు న్యాయం చేయాలని, వెంటనే వేతనం అందించేందుకు చర్యలు చేపట్టాలని దళిత సంఘాల నాయకులు ఎంఈఓను పాఠశాల నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా ఎంఈఓను గట్టిగా నిలదీయండంతో వేతనం అందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎంఈఓ దిగివచ్చారు.


