చిలప్‌చెడ్(నర్సాపూర్): మండలంలో శీలాంపల్లి గేటు నుంచి అంతారం గేటు వరకు హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి సుమారు 9 కిలోమీటర్ల రోడ్డు పనులకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రూ. 6.70 కోట్లు మంజూరు అయ్యాయి. ఆరేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే, నాయకుల మధ్య, పనుల ప్రారంభానికి శీలాంపల్లి గేటు వద్ద భారీగా శంకుస్థాపన చేశారు. కాగా పనులు మాత్రం శీలాంపల్లి గేటు నుంచి కాకుండా, అంతారం గేటు నుంచి పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు, ముందున్న పాత బీటీ రోడ్డును పూర్తిగా తవ్వించి, శీలాంపల్లి గ్రామం వరకు మాత్రమే రోడ్డు వేయించి, మంజూరైన నిధుల్లో జీఎస్టీ రూపంలో షాక్ తగలడం, అంచనాకు మించి ఖర్చులు ఎక్కువ కావడంతో నిధులు సరిపోవడం లేదని కిలోమీటరు రోడ్డు పనులు అలాగే వదిలేశాడు. దాంతో ఆ కాస్త రోడ్డులో ప్రయాణించేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డుపై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో శీలాంపల్లి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో రోడ్డంతా బురద, చలికాలంలో విపరీతమైన దుమ్ముతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో సర్పంచ్ రాజేందర్‌రెడ్డి సొంత ఖర్చులతో పలుమార్లు మట్టి పోయించినప్పటికీ, వర్షం కురిస్తే ఇబ్బంది తప్పడం లేదు. మిగిలిపోయిన రోడ్డు పనులకు మోక్షం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.
9 కి.మీ రోడ్డు పనులకు రూ.6.7 కోట్లు మంజూరు
నిధులు సరిపోక కిలోమీటరు రోడ్డు పనులు వదిలేసిన కాంట్రాక్టర్
ఐదేళ్లుగా ఇబ్బందులకు గురవుతున్న ప్రయాణికులు


