రూ.4వేల వరకు
ధర వచ్చే అవకాశం
జహీరాబాద్: జిల్లాలోని ఆయా చక్కెర కర్మాగారాల్లో 2026–27 సీజన్‌కు గాను చేపట్టాల్సిన క్రషింగ్ అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సీజన్‌లో జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో డిసెంబర్‌లో క్రషింగ్ మొదలు పెట్టే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. క్రషింగ్ కోసం అవసరమైన టర్బైన్స్‌తోపాటు సుమారు రూ.5 కోట్లకు పైగా విలువ చేసే పలు రకాల యంత్రాలను సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సైతం కర్మాగారంలో అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 6 నుంచి కర్మాగారంలో పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కర్మాగారానికి జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలను కేటాయించే అవకాశముంది. రాయికోడ్‌లోని గోదావరి–గంగా చక్కెర కర్మాగారంలో ఈ నెల 25న క్రషింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండగా..సంగారెడ్డిలోని గణేశ్ చక్కెర కర్మాగారంలో మాత్రం నవంబర్ 10న క్రషింగ్‌ను చేపట్టే అవకాశం ఉన్నట్లు కేన్ అధికారులు చెబుతున్నారు.
లేబర్ అందుబాటులో
మహారాష్ట్రలోని బీడ్ ఏరియాలో వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అక్కడి కూలీలు చెరుకు పంట నరికేందుకు జహీరాబాద్ ప్రాంతానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కూలీల సమస్య తీరనుంది. ఇది రైతులకు సంతోషకరమైన విషయం. ఇప్పటికే కర్ణాటకలోని బరూర్‌లో క్రషింగ్ ప్రారంభించారు. టన్నుకు రూ.3వేలు ధర చెల్లించి, చెరుకు కోత, రవాణ ఖర్చులు వారే భరించేందుకు ముందుకు వస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులు వారిని ఆశ్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
తగ్గనున్న పంట దిగుబడులు
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో చెరుకు పంట దిగుబడులు పడిపోనున్నాయి. గతేడాది ఎకరానికి సగటున 36 టన్నులు రాగా, ఈ ఏడాది మాత్రం 28 టన్నులు మాత్రమే వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పంట సాగు విస్తీర్ణం పెరిగినా గతేడాది కంటే ఉత్పత్తులు తగ్గనున్నాయి. గతేడాది 9.75లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి అయింది. ఈ ఏడాది మాత్రం 7.50 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశమున్నట్లు అంచనా.
ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో గానుగ ప్రారంభం !
లక్ష్యంగా 7.50 లక్షల టన్నుల చెరుకు
25న గోదావరి–గంగా, నవంబర్ 10న గణపతి ఫ్యాక్టరీల్లో క్రషింగ్
రైతులకు చెరుకు ధర టన్నుకు రూ.4వేల వరకు వచ్చే అవకాశముంది. రైతులు మాత్రం రూ.4,500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరిగినా ఎల్‌నినో ప్రభావంతో గతేడాది కంటే దిగుబడులు రెండు లక్షల టన్నుల వరకు తగ్గే అవకాశముంది. ఎఫ్‌ఆర్‌సీ మేరకు యాజమాన్యాలు ధర చెల్లించనున్నారు. డ్రైటెండ్ యాజమాన్యం క్రషింగ్‌కు సిద్ధమవుతోంది.
–రాజశేఖర్,
కేన్ అసిస్టెంట్ కమిషనర్–సంగారెడ్డి


