● కేంద్ర పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం
● ఎంపీ ప్రశ్నలకు తికమకపడిన యంత్రాంగం
● అరకొర సమాధానాలతో సరి
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై జిల్లాకు 7 ట్రాక్టర్లు మంజూరు చేసింది. వాటిలో 6 ట్రాక్టర్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సంబంధిత ఉద్యానశాఖ అధికారి సొంతంగా నిర్ణయం తీసుకోవటంపై ఎంపీ నిలదీశారు. తనకు కనీసం సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చామనటంతో అవి కేంద్రం నిధులు కదా..? తమకు ఎందుకు చెప్పలేదంటూ నిలదీశారు. అలాగే జిల్లాలో 154 మంది అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ. 4 వేల చొప్పున కేంద్రం అందిస్తుంటే ఆ నిధులను లబ్ధిదారులకు అందించారా..? అని ప్రశ్నించారు. జిల్లాలోని అంగన్‌వాడీ భవనాలకు కేంద్రం కలర్లు వేసేందుకు నిధులు మంజూరు చేస్తే వాటిని సద్వినియోగం చేశారా? ఎన్ని భవనాలకు వేశారంటూ లెక్కలు అడిగారు.
● జిల్లాలోని మెదక్, నర్సాపూర్, చేగుంట తదితర మండలాల్లో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. వీటిపై ప్రతి దిశ మీటింగ్‌లో చర్చకు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గతంలో ఈవిషయంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశించినా, అధికారులు చర్యలు తీసుకోలేదు.
● అలాగే ‘ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్నా దీనిపై ప్రజలకు సరైన అవగాహన కరువైంది. ఫలితంగా ఇంత మంచి పథకం మురుగున పడుతుందని, ఏదో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి ఆర్‌సీసీ ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపీ ఆదేశించారు.
● 2025–26 సంవత్సరానికి గాను మోడల్ సోలార్ విలేజ్ గ్రామానికి రూ. కోటి పైచిలుకు కేంద్రం నుంచి నిధులు మంజూరు కాగా, పాపన్నపేట గ్రామాన్ని ఎంపిక చేశారు. కాగా ఆ నిధుల విడుదలలో ఆలస్యం జరగటంతో ఇంకా పనులు ముందుకు సాగడం లేదని తెలిసింది. నిధులు మంజూరైతే ఆ గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, సూళ్లు, ప్రతి ఇంటిపై కరెంట్ ఉత్పత్తి సోలార్ వెలుగులు ఉంటాయని డీపీఓ పేర్కొన్నారు.
● ఓ గ్రామంలో బోరు తవ్వటంతో పాటు మోటర్ కోసం ఓ అధికారి రూ. 2.50 లక్షలు ఖర్చు వచ్చిందని ఎంబీ రికార్డు చేశారు. గ్రామాల్లోకి భగీరథ నీరు వస్తున్నా బోర్లు ఎందుకు తవ్వుతున్నారు. ఒక్క బోరుకు రూ. 2.50 లక్షల ఖర్చు ఎలా వస్తుంది..? అంటూ ఎంపీ ఆ అధికారిపై ప్రశ్నల వర్షం కురిపించారు. మళ్లీ 3 నెలల అనంతరం జరగబోయే సమావేశానికి సమాధానాలతో పాటు ప్రస్తుతం ప్రస్తావనకు వచ్చిన పనులు పూర్తి చేయాలని, కేంద్రం నుంచి వచ్చే పథకాల అమలు చేసే ముందు తనకు ఆహ్వానం ఉండాలని, లేనిచో చర్యలు తప్పవరి హెచ్చరించారు.
ఆయా ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తించే జిల్లాస్థాయి అధికారులకు వారి శాఖలపై సరైన అవగాహన లేదని తేలిపోయింది. కేంద్ర పథకాలపై ప్రతి మూడు నెలలకోసారి జరిగే జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశ) మీటింగ్‌లో ఎంపీ రఘునందన్‌రావు అడిగిన ప్రశ్నలకు వారి నుంచి స్పందన కరువైంది. కేంద్రం విడుదల చేసిన నిధులు, పథకాల అమలు తీరు, లబ్ధిదారుల ఎంపిక విషయమై సమాధానం చెప్పడంలో విఫలమయ్యారు.
– మెదక్‌జోన్


