నర్సాపూర్ రూరల్: విద్యార్థులు కష్టపడి ఏకాగ్రతతో చదువుకోవాలని బీజేపీ ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాపగారి రమేశ్‌గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కాగజ్‌మద్దూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని, సమయం వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువులో ముందంజలో ఉంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ఆయా విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, బీజేవైఎం మండలశాఖ అధ్యక్షుడు రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ మొదట అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి, పూలతో అలంకరించిన పల్లకీపై ఉంచారు. మంగళహారతులతో మహిళలు ముందు నడువగా, భక్తులు పల్లకీ మోశారు. ఆలయం వద్ద నుంచి గోకుల్ షెడ్డు వరకు ఊరేగించారు. భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
కౌడిపల్లి(నర్సాపూర్): ఎస్‌జీఎఫ్ కబడ్డీ పోటీల్లో ఎంజేపీ తునికి, కౌడిపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు జిల్లాస్థాయిలో ప్రథమ స్థానం సాధించారని ప్రిన్సిపాల్ హరిబాబు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అండర్–14, అండర్–17లో ప్రథమ స్థానం నిలిచారని కొనియాడారు. ఈసందర్బంగా గెలుపొందిన విద్యార్థులను ఏటీపీ జ్యోతి, పీడీ అంజలి, పీఈటీలు శేఖర్, భరత్, ఉపాధ్యాయులతో కలిసి అభినందించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
తూప్రాన్: డివిజన్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు కానున్న కోర్టు భవన పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని, అక్టోబర్ చివరి వారంలోగా పూర్తి చేసి కోర్టును ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ వెల్లడించారు.
శనివారం పనుల పురోగతిని పరిశీలించి మాట్లాడారు. నూతన కోర్టు అందుబాటులోకి వస్తే తూప్రాన్ టౌన్, రూరల్ మండలాల ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లే పనిలేకుండా స్థానికంగానే త్వరితగతిన న్యాయసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ బావయ్య, డీఎస్పీ నరేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, సీఐ వెంకటరాజాగౌడ్, సబ్ ఇన్‌్‌స్పెక్టర్ గంగరాజుతో పాటు రోడ్లు, భవనాల శాఖ అధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.


