సప్తస్వరాల వాణి
●
ఆమె గొంతు విప్పితే సప్త స్వరాలు ప్రవహిస్తాయి. ఆమె పాడుతుంటే శ్రోతలు మైమరిచిపోతారు. తండ్రి ప్రోత్సాహంతో ముందుకుసాగిన ఆమె జాతీయస్థాయిలో రాణించి గుర్తింపు పొందారు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగి ప్రతిభ చాటారు.
– రామాయంపేట(మెదక్)
తండ్రి ఆశయ సాధనలో నార్సింగి కోకిల
జాతీయస్థాయికి ఎదిగిన ప్రతిభ
నాన్న ఆశయాలు నెరవేరుస్తా
తన తండ్రి భౌతికంగా దూరమైనా, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తా. నన్ను గొప్ప స్థానంలో చూడాలనుకున్న నాన్న ఆశయాలను నెరవేరుస్తా. ఎన్ని కష్టాలెదురైనా నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తా.
– శర్వాణి, గాయని
జిల్లాలోని నార్సింగి మండల కేంద్రానికి చెందిన లక్ష్మణచారి– సరస్వతి దంపతులకు ముగ్గురు సంతానం. అందరూ ఆడపిల్లలే.. గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసిన చారి కష్టపడి పిల్లలను పెంచి పోషించారు. పెద్ద కూతురు శర్వాణికి చిన్నప్పటి నుంచే పాటలంటే మహా ఇష్టం. టీవీలో పాటలు వస్తే వాటిని అనుకరించేది. చిన్నతనంలోనే కూతురిలో ప్రతిభను గుర్తించిన తండ్రి ప్రోత్సహించారు. గొప్ప గాయకురాలిగా తన కూతురిని చూడాలని కలలు కన్నారు. ప్రతి అడుగులో ఆమెకు అండగా నిలిచారు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరింతగా రాటుతేలిన శర్వాణి జాతీయస్థాయిలో ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగింది. ఈమేరకు బెంగళూరు, కలకత్తా, భోపాల్, చైన్నెతో పాటు తదితర రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు. అద్భుతమైన గానంతో తన స్వగ్రామమైన నార్సింగికి మంచి పేరు తెచ్చింది. రెండేళ్ల క్రితం తండ్రి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆమె జీవితం చీకటిమయమైంది. చాలా రోజుల పాటు పాటలకు దూరమైంది. దగ్గరి వారి ఓదార్పు, ప్రోత్సాహంలో ఇటీవల మళ్లీ ప్రదర్శనల్లో పాటలు పాడుతూ రాణిస్తుంది.


