జిల్లా పర్యాటక అధికారి ఎల్లయ్య
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఆదివారం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి ఎల్లయ్య శనివారం తెలిపారు. కలెక్టర్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 వేల మందితో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, మెతుకుసీమ సాంప్రదాయ శోభాయాత్ర ఉంటుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే రోహిత్‌రావు, ఎంపీ రఘునందన్‌రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం పట్టణంలోని వెస్లి కళాశాలలో వివిధ కళారూపాల ప్రదర్శన ఉంటుందన్నారు.
నేడే ఉల్లాస్ పరీక్ష
హాజరుకానున్న 29,093 మంది మహిళలు
సంగారెడ్డి టౌన్: స్వయం సహాయక సంఘాలలోని మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘అందరికీ విద్య.. అందరి బాధ్యత’ అనే నినాదంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరక్షరాస్యులను గుర్తించి వారి కోసం గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వలంటీర్లను ఏర్పాటు చేసి వారికి విద్యను బోధించారు. జిల్లావ్యాప్తంగా ఆదివారం 29,093 మంది మహిళలు పరీక్ష రాయనున్నారు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో 24,321 మంది, అర్బన్ ఏరియాలో 4,772 మంది పరీక్షకు హాజరు కానున్నారు. జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి సూర్యారావు మాట్లాడుతూ.. స్వ యం సహాయక సంఘాలలో నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మహి ళలకు పరీక్షను నిర్వహించి ప్ర తిభను వెలుగులోకి తెస్తామన్నారు.


