● నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ముఖ గుర్తింపు హాజరు యాప్‌లో నమోదు కావాలని, నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో ‘మీ ప్రమాణం యాప్’ నమోదుపై అన్నిశాఖల జిల్లా అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రతిస్థాయి రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు యాప్ ద్వారానే హాజరు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు నమోదు కాని శాఖలు వెంటనే నమోదు చేసుకోవాలని ఆదేశించారు. మీ ప్రమాణం హాజరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖాధిపతులు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు సిబ్బంది హాజరు వివరాలు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. అనంతరం రోడ్డు రవాణా, పోలీస్, ఇతరశాఖ అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణపై సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఈడీఎం సందీప్ ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


