● కొనసాగుతున్న సర్వీస్ రోడ్ల నిర్మాణం పనులు ● ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు
రామాయంపేట(మెదక్): జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇందులోభాగంగా బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రదేశాల్లో ఆర్‌ఓబీలతోపాటు సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. జాతీయ రహదారిపై స్థానిక అడిగాస్ చౌరాస్తా వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి ఇటీవల రూ.40 కోట్లు మంజూరు చేసింది. స్థానిక కోమటిపల్లి, వల్లూరు జంక్షన్ల వద్ద సర్వీస్ రోడ్ల నిర్మాణానికిగాను రూ.నాలుగున్నర కోట్లు నిధులిచ్చింది. ఈ పనులు పూర్తయితే ఆయా జంక్షన్లవద్ద రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి.
జిల్లా పరిధిలో కాళ్లకల్ నుంచి రామాయంపేట మండలం దామరచెరువు వరకు 55 కిలోమీటర్ల మేర 44వ నంబర్ జాతీయ రహదారి విస్తరించి ఉంది. ఈ రహదారిపై గుర్తించిన 14 బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రతి రోజూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, అజాగ్రత్త కారణంగా రోజు రోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. నెలలో కనీసం 20కి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. ఈ మేరకు జాతీయ రహదారులశాఖ అధికారులు గుర్తించిన బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.


