వక్రాచార్యులు | - | Sakshi
Sakshi News home page

వక్రాచార్యులు

Sep 24 2026 7:52 AM | Updated on Sep 24 2026 7:52 AM

తమ మాట వినకుంటే ఫెయిల్‌ చేస్తానని ఒకరు విద్యార్థినుల పట్ల అసభ్యంగా మరొకరు డబ్బులివ్వాలని ఇంకొకరు.. పవిత్రమైన వృత్తికే మచ్చ తెస్తున్న కొందరు అధ్యాపకులు

ఇటీవల చదువు చెప్పే నెపంతో ఓ విద్యార్థినికి ఓ అధ్యాపకుడు వ్యక్తిగతంగా మెస్సేజ్‌ పెట్టవచ్చా అంటూ ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. అదిచినికి చినికి గాలివానగా మారి విద్యార్థిని బంధువులు సదరు లెక్చరర్‌ను రెండుగంటల పాటు గదిలోకి తీసుకెళ్లి పలు ప్రశ్నలు అడిగి కొట్టినట్లు తెలిసింది.

ఓ విద్యార్థినికి తను చెప్పిట్లు వినకుంటే సస్పెండ్‌ చేస్తానంటూ బెదిరిస్తూ కాలేజీ వాట్సాప్‌గ్రూప్‌లో మరో అధ్యాపకుడు పోస్టు చేశాడు. దీంతో ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసింది. ఇదే అధ్యాపకుడు గతంలో పిల్లల వద్ద ఫీజులు వసూళ్లు చేసి తన సొంతానికి వాడుకున్నట్లు కూడా తెలిసింది. పైగా తను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకుంటే ఫెయిల్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిల్‌ చేయటం, ఒక్కో విద్యార్థి తనకు రూ.10 వేల చొప్పున ఇస్తేనే పాస్‌ చేస్తానని భయపెట్టడం ఇలా పలుమార్లు కాలేజీలో న్యూసెన్స్‌ చేయటంతో సదరు లెక్చరర్‌పై విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదులు చేశారు.

మరో లెక్చరర్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఎవరైనా విద్యార్థులుగానీ, అధికారులుగానీ అడిగితే తనది లోకల్‌..ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఇదే అధ్యాపకుడు ఏకంగా బయటి వ్యక్తులను కళాశాలకు పిలిపించి గతంలో ఓ గొడవ విషయమై మరో లెక్చరర్‌ను కొట్టించినట్లు కూడా తెలుస్తోంది. ఇలా కొంతమంది లెక్చరర్ల తీరుతో డిగ్రీ కళాశాల పరువు బజారు కీడుస్తున్నారని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

మనలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానవెలుగులు ప్రసాదించేవాడు గురువు. తల్లిదండ్రుల తర్వాత కాళ్లుమొక్కేది గురువుకే. గురువంటే అంత పవిత్రమైన వృత్తి. విద్యార్థి తప్పు చేస్తే గురువు సరిదిద్దుతాడు. కానీ, అదే గురువు విద్యార్థుల పట్ల తప్పు చేస్తే సరిదాద్దాల్సిందెవరు? తులసివనంలో గంజాయి మొక్కలా ఇప్పుడు ఆ వృత్తికే కొంతమంది తమ చేష్ఠల ద్వారా మచ్చ తెస్తున్నారు. జిల్లాలోని డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం.

– మెదక్‌జోన్‌

స్వయంప్రతిపత్తి పొంది

మెదక్‌ డిగ్రీ కళాశాలకు ఈ ఏడాది అటాన్‌మస్‌(స్వయం ప్రతిపత్తి)కి ఎంపికవటంతో ఇందులో చదువుకున్న పూర్వవిద్యార్థులు, ఉన్నతాధికారులు, విద్యావేత్తలు ఎంతో సంతోషించారు. దీన్నివల్ల కళాశాల సిబ్బందికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కుకలిగింది. విద్యార్థులకు సంబంధించిన ఫీజులు, పరీక్షలు నిర్వహించటం, మెమోలలో ఏదైనా తప్పులు దొర్లినా ఇక్కడే సరిచేసుకునే వీలు ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే గతంలో ఓయూకు వెళ్లి రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి నుంచి స్వయం నిర్ణయం తీసుకునే వీలు కలిగింది. దీంతో దాతల సహకారం, సీఎస్‌ఆర్‌ నిధులతో కాలేజీలో కంప్యూటర్ల ఏర్పాటు, ఫ్యాన్లు, మహిళా టాయిలెట్స్‌ తదితర అభివృద్ధితో ముందుకెళ్తుంటే కొందరు లెక్చరర్లతో కాలేజీకే చెడ్డపేరు వచ్చే పరిస్థితి నెలకొంది. అలాంటి వారిపై తక్షణమే చర్యలు తీసుకుని భావితరం భవిష్యత్తుకు భరోసాను ఇవ్వాలని విద్యార్థి సంఘాలు, స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు!

కొంతకాలంగా డిగ్రీ కళాశాలలో కొందరు అధ్యాపకులు సృష్టిస్తున్న వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కమిషనర్‌కు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఇద్దరు లెక్చరర్లు విద్యార్థులతో తప్పుగా ప్రవర్తించిన విషయంపై కళాశాల బృందంతో కూడిన విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కమిషనరేట్‌కు పంపినట్లు తెలిసింది. మరి ఈసారైనా తప్పుగా ప్రవర్తిస్తున్న అధ్యాపకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో..? లేక ఎప్పటిలాగే వదిలేస్తారో వేచి చూడాల్సిందే.

జిల్లా కేంద్రంలో 1981లో ప్రభుత్వ డిగ్రీకళాశాలను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలపై చిన్న మచ్చలేకుండా సాగింది. ప్రస్తుతం 12 గ్రూప్‌లు, 14 డిపార్ట్‌మెంట్లతోపాటు 1,888 మంది పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. కొన్ని నెలలుగా కొందరు అధ్యాపకులే అక్రమాలకు పాల్పడుతూ కళాశాల పరువును బజారుకీడ్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement