శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధి చిన్న గొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయ పూజారులు స్వామివారికి అభిషేకం, మన్యసూక్త పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకం అనంతరం సత్యనారాయణ స్వామి మండపంలో సామూహిక వ్రతాలను ఆచరించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాస్, ఆలయ ఫౌండర్, చైర్మన్ ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకులు దేవదత్తశర్మ, ప్రభుశర్మ, దేవిశ్రీ, సిబ్బంది ఉన్నారు.
వెల్దుర్తి(తూప్రాన్): పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్‌పూర్‌లోని మహంకాళి మాత దేవస్థానంలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తోంది. రసాయన పదార్థాలకు దూరంగా, ప్రకృతిలో సహజంగా లభించే స్వచ్ఛమైన వస్తువులతో ఏడు అడుగుల గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహ తయారీలో ఆవుపేడ, ఆవు మూత్రం, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి, పుట్టమట్టి, పసుపు, కుంకుమ, గరికతో పాటు వివిధ రకాల పవిత్ర పూజా ద్రవ్యాలను వినియోగించారు. ఎం.ఫార్మసీ విద్యార్థిని కావేరి గాయత్రి ఈ విగ్రహాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దగా, గోశాల కన్వీనర్ కావేరి జ్ఞానేశ్వర్ తగిన సహకారం అందించారు. అలాగే, విగ్రహ తయారీకి కావాల్సిన వస్తువులను ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు కావేరి సుశీల సత్యనారాయణ సమకూర్చారు. మహంకాళి మాత దేవస్థానంలో గత కొన్నేళ్లుగా పర్యావరణహిత పద్ధతులనే పాటిస్తూ మట్టి వినాయకుడిని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు. ప్రకృతి పరిరక్షణ సందేశాన్ని బలంగా చాటుతున్న ఈ వినూత్న ప్రయత్నం స్థానికులు, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ప్రభుత్వ ఫలాలు
ప్రతి గడపకూ చేరాలి
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత
మెదక్‌జోన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అభివృద్ధి ఫలాలను ప్రజల గడపగడపకూ తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణిత పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్ అధ్యక్షతన ‘సేవా సంకల్ప అభియాన్’ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజుతో పాటు తెలంగాణ విమోచన దినోత్సవం అని గుర్తుచేశారు. అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలు కొనసాగుతాయని వెల్లడించారు. బూత్‌స్థాయిలో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛభారత్, మొక్కలు నాటడం, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ నేతలు ఈర్ల రంజిత్‌రెడ్డి, సురేష్, శ్రీనివాస్, రమేష్‌గౌడ్, రాగి రాములు పాల్గొన్నారు.


