కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి మండలంలోని కొట్టాల, లింగంపల్లి, సదాశివపల్లి, బూరుగడ్డ, పాంపల్లి గ్రామ పంచాయతీలోని రైతుల వివరాలు ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో కనిపించడంలేదు. ఆయా గ్రామాల్లో సుమారు 1,800 మంది రైతులు మూడు వేలకు పైగా ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. వీరికి యూరియా అత్యవసరం కాగా యాప్‌లో బుకింగ్ లేకపోవడంతో యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. యాప్‌ద్వారా యూరియా బుకింగ్‌కు రైతులు ఆధార్ నంబర్‌తో నమోదు చేసేందుకు ప్రయత్నించగా రైతు వివరాలు, భూమి వివరాలు చూపించడంలేదు. దీంతో యూరియా ఇతర ఎరువులు బుకింగ్ చేసుకుని తీసుకుని అవకాశంలేకుండా పోయింది. ఓ వైపు వరిపంటకు యూరియా అత్యవసరం కాగా ఎరువులు అందక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 7న సమస్యను గుర్తించిన ఇప్పటివరకు అధికారులు పరిష్కరించలేదని ఆయా గ్రామాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్‌జీడీ కోడ్ లేకపోవడంతో సమస్య!
మండలంలోని కొట్టాల, లింగంపల్లి, సదాశివపల్లి, బూరుగడ్డ, పాంపల్లి గ్రామాలు గతంలో వెల్మకన్న గ్రామపంచాయతీ పరిధిలో ఉండగా ప్రస్తుతం అన్ని గ్రామాలు విడతలవారీగా కొత్త పంచాయతీలేర్పడ్డాయి. ప్రస్తుతం ఈ గ్రామాలకు సంబంధించిన వివరాలు ఎల్‌జీడీ కోడ్ లేకపోవడంతో యాప్‌లో కనిపించడంలేదని స్థానిక ఏఓ స్వప్న చెప్పారు. ఈ విషయం జిల్లా అధికారులకు చెప్పామని సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలో సమస్య పరిష్కారమవుతుందన్నారు.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో కనిపించని భూముల వివరాలు
ఓ వైపు యూరియా దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ప్రభుత్వం యూరియా బుకింగ్ కోసం తీసుకువచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో మండలంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో రైతులు, రైతుల భూముల వివరాలు కనిపించకపోవడంతో యూరియా బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయా గ్రామాల్లోని సుమారు 1,800 మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సమస్యను పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ అయింది. కాగా, ప్రస్తుతం వచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో ఐదు గ్రామాల వివరాలు లేకపోవడంతో ఎరువులు బుకింగ్ కావడం లేదు. దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. లక్షల పెట్టుబడితో పంటసాగు చేయగా యూరియా అందక ఎదగని పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు స్పందించి సమస్య తీర్చాలి.
– పరంలాల్, రైతు లింగంపల్లి
యూరియా అందక రైతులకు తప్పని కష్టాలు
జిల్లా అధికారులకు చెప్పాలంటున్న వ్యవసాయ అధికారులు


