పోలీసుల త్యాగం మరువలేనిది
పాపన్నపేట(మెదక్): పాపన్నపేట పోలీస్ స్టేషన్‌పై నక్సల్స్ తల పెట్టిన నరమేధానికి సరిగ్గా 27 యేళ్లు. 13 సెప్టెంబర్ 1999 రోజున పీపుల్స్ వార్ నక్సలైట్లు బాంబులు..తుపాకులతో దాడికి తెగబడి ఐదుగురు పోలీసులను పొట్టన బెట్టుకున్నారు. సరిగ్గా ఆ రోజు వినాయక చవితే కావడం ఇప్పుడు ఒకరోజు తర్వాత పండుగ రావడం యాదృచ్ఛికమే అయినా పండుగ రాగానే నాటి చేదు జ్ఞాపకాలు అటు బాధిత కుటుంబాలను..ఇటు పాపన్నపేట గ్రామస్తులను వెంటాడుతూనే ఉంటాయి. నాటి ఘటనలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు ఆబిద్‌హుస్సేన్, ప్రసాద్, నర్సింహులు, రాంచందర్ వీరమరణం పొందిన ఘటన పాపన్నపేట ప్రజలయాదిలో కదలాడుతూనే ఉంది.
నెత్తుటి మరకలు..తడారని కన్నీరు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నక్సల్స్ తూటాలకు నేల కొరిగిన ఐదుగురు పోలీసుల కుటుంబాలు వినాయక చవితి పండుగ వస్తే చాలు..కన్నీరు మున్నీరవుతుంటారు. తెగిన తాళ్లను చూసి భార్యలు..కన్న ప్రేమకు దూరమైన పిల్లలు విలవిల్లాడుతుంటారు. తమ కుటుంబీకుల త్యాగానికి ప్రభుత్వ పరంగా సహాయం అందినా, పోయిన వారి ప్రేమకు దూరమయ్యామనే ఆవేదన వారిని వెంటాడుతూనే ఉంది. హెడ్ కానిస్టేబుల్ రఘునందన్ భార్య పుష్పమ్మ, కానిస్టేబుల్ నర్సింహులు భార్య నిర్మల మాట్లాడుతూ..తమకు సంగారెడ్డిలో ఇస్తామన్న ప్లాట్లు ఇంతవరకు రిజిస్ట్రేషన్ కావడం లేదన్నారు. వాటిని ఇప్పించి ,తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు.
ఐదు కుటుంబాల్లో వీడని విషాదం
నాడు..నేడు సరిగ్గా వినాయక చవితి రోజే
పాపన్నపేట పోలీస్ స్టేషన్‌పై నక్సల్స్ దాడికి 27 యేళ్లు
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు చేసిన త్యాగం మరువలేనిది. పోలీసులు కూడా ప్రజల కోసం , తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలు కూడా అన్ని విధాల పోలీసులకు సహకరించాలి.
– శ్రీనివాస్ గౌడ్, ఎస్సై, పాపన్నపేట


