శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వం ప్రవేశపెట్టిన 97 జీఓను రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం మండల పరిధిలోని గోమారం పాలిటెక్నిక్ విద్యార్థులు తరగతులు బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. చౌరస్తా వద్ద మానవహారంగా ఏర్పడి రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ.. జీఓ 97 వల్ల తమ భవిష్యత్తుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవో రద్దుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకుని విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు.


