మెదక్ కలెక్టరేట్: జిల్లాలో జరుగుతున్న కాడాస్ట్రల్ రీ–సర్వే పది గ్రామాల్లో 13 వేల ఎకరాల్లో పూర్తయిందని కలెక్టర్ ప్రతిమాసింగ్ వెల్లడించారు. పనులను నిర్దేశిత కాలవ్యవధిలో అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో కాడాస్ట్రల్ రీ–సర్వే నిర్వహణ పురోగతిని అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్, ఆర్డీవోలు రమాదేవి, రామకృష్ణ, బావయ్య సంబంధిత తహసీల్దారులు, సర్వేర్లతో మెదక్ జిల్లాలో రీ సర్వే పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నారన్నారు. కాడాస్ట్రల్ రీ–సర్వే కార్యక్రమం భూ రికార్డులను శాసీ్త్రయంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
కోతుల బెడద నివారణ చర్యలు
జిల్లాలో కోతుల బెడద నివారించి రైతులకు ఉపశమనం కల్పించే దిశగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో కలిసి సుమారు 6,500 కోతులున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఎఫ్‌ఓ జోజి, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్
కేసుల దర్యాప్తులో జాప్యం వద్దు
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
మెదక్‌జోన్: పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన క్రైం సమీక్షలో ఆయన మాట్లాడారు. దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు. కేసులను దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం వరకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇటీవల కొన్ని కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐలు రేణుకరెడ్డి, వెంకటరాజాగౌడ్, రంగా కృష్ణాలతోపాటు వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.
విద్యుత్ కోతలపై రైతుల నిరసన
శివ్వంపేట(నర్సాపూర్): వ్యవసాయ బోరుబావులకు సక్రమంగా విద్యుత్ సరఫరా జరగకపోవడం పట్ల మండల పరిధి చండి గ్రామ రైతులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి 8 నుంచి 9 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుందన్నారు. నిరంతరాయంగా సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. పంటకు నీరు అందకపోవడంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


