బీఆర్‌ఎస్ రాస్తారోకో
కౌడిపల్లి(నర్సాపూర్): వ్యవసాయానికి ఎదురవుతున్న విద్యుత్ సమస్యను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సారరామాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని వెంకట్రావ్‌పేటగేట్ వద్ద 765డి జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని వెంకట్రావ్‌పేట, రాజిపేట సబ్‌స్టేషన్ల నుంచి వ్యవసాయానికి కనీసం ఏడు గంటలు కూడా కరెంట్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండుతున్నాయన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం 24గంటలు కరెంట్ సరఫరా చేస్తే దొంగహామీలతో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఏడు గంటలపాటు కూడా కరెంట్ ఇవ్వడంలేదని, లోవోల్జేజీతో మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ ఏడీ రాఘవేందర్‌రావ్, ఏఈఈ సాయికుమార్, సీఐ రంగక్రిష్ణ, నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి విద్యుత్ సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో రైతులు రాస్తారోకోను విరమించారు. కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్‌లు కుతుబుద్దీన్, శివారెడ్డి, కోలశ్రీనివాస్, ఎల్లం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వెంకట్రావ్‌పేటగేట్ వద్ద భారీగా ఆగిన వాహనాలు
సంఘటన స్థలానికి విద్యుత్‌శాఖ ఏడీ, సీఐ


