అక్రమ సర్దుబాట్లు | - | Sakshi
Sakshi News home page

అక్రమ సర్దుబాట్లు

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

రిలీవ్‌ చేయని హెచ్‌ఎంలు!

ఉపాధ్యాయులు అదనంగా ఉన్న పాఠశాలల నుంచి టీచర్ల కొరత ఉన్న బడులకు పని సర్దుబాటు పేరుతో విద్యాశాఖలో భారీ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇలాంటి అక్రమాలతో విద్యార్థులకు, సమాజానికి ఆదర్శప్రాయమైన ఉపాధ్యాయ వృత్తికే కొందరు టీచర్లు మచ్చతెస్తున్నారు. ఫలితంగా ఉపాధ్యాయ వృత్తి నైతికత ప్రశ్నార్థకంగా మారుతోంది. –మెదక్‌జోన్‌

జిల్లా వ్యాప్తంగా 1నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్‌, గవర్నమెంట్‌ పాఠశాలలు 877 ఉండగా అందులో 62 వేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి బోధించేందుకు 3,521 మంది ఉపాధ్యాయులున్నారు. కాగా విద్యాహక్కు చట్టం ప్రకారం హైస్కూల్‌లో సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. అలాగే కాంప్లెక్స్‌ పరిధిలో ఉన్న బడుల్లో టీచర్లు ఎక్కువగా ఉన్నచోటు నుంచి తక్కువగా ఉన్న బడికి పంపాలి. ఒకవేళ ఆ కాంప్లెక్స్‌ పరిధిలో ఖాళీలు లేకపోతే పక్క కాంప్లెక్స్‌లో అవసరం ఉంటే సర్దుబాటు చేయాలి. అక్కడా లేకుంటే పక్క మండలానికి పంపించాలి అంతేకానీ వంద కిలోమీటర్ల దూరంలోని కోరుకున్న చోటుకి పంపించడం వెనుక ఆంతర్యం ముడుపులు చేతులు మారడమేనని అవగతమవుతోంది.

281 మంది సర్దుబాటు

పని సర్దుబాటు పేరుతో నెలరోజుల పాటు కసరత్తు చేసిన సంబంధిత అధికారులు 281 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. వీరిలో 30 నుంచి 35 మంది వరకు ఉపాధ్యాయులను కోరుకున్న చోటుకు నిబంధనలను ఉల్లంఘించి పంపినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. హైదరాబాద్‌ సమీప మండలాలైన తూప్రాన్‌, మనోహరాబాద్‌, నర్సాపూర్‌, చేగుంట మండలాలకు సర్దుబాటులో భాగంగా పోటీపడి పంపటంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా మచ్చుకుకొన్ని

ఉపాధ్యాయుల సర్దుబాటులో భాగంగా టేక్మాల్‌ మండలంలోని ఓ పాఠశాలలో చదువుచెప్పే ఓ టీచర్‌ను హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నటు వంటి మనోహరబాద్‌కు బదిలీ చేశారు. అల్లాదుర్గ్‌ మండలంలోని ఓ టీచర్‌ను చేగుంట మండలం రెడ్డిపల్లికి, హవేళిఘనాపూర్‌ మండలం రాజిపేటలో చదువు చెప్పే మరో మహిళా టీచర్‌ను నర్సాపూర్‌కు, పెద్దశంకరంపేట, టేక్మాల్‌ మండలాల్లోని ఉపాధ్యాయులను మెదక్‌కు సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఒక టీచర్‌కు రెండుచోట్ల పోస్టింగ్‌!

ఒక టీచర్‌కు రెండు చోట్ల పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయటంలోనే ఉన్నతాధికారుల నిబద్ధత ఏ మేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామాయంపేట మండలం కాట్రియాల ఉన్నత పాఠశాలలో హిందీ టీచర్‌ను అదే మండలంలోని లక్ష్మాపూర్‌లోని ఉన్నత పాఠశాలలో సైతం చదువు చెప్పాలని హుకుం జారీ చేశారు. వారంలో ఒక్కపాఠశాలలో మూడు రోజులు, మరో పాఠశాలలో మూడు రోజుల చొప్పున చదువు చెప్పాలని ఉత్తర్వులిచ్చారు. వాస్తవానికి ఒక టీచర్‌ ఒకచోట బోధిస్తుంటేనే షెడ్యూల్‌ ప్రకారం సకాలంలో పాఠ్యాంశాలు పూర్తికావు. అలాంటిది రెండు చోట్లా ఎలా చెబుతారు..? షెడ్యూల్‌ ప్రకారం పాఠ్యాంశాన్ని ఎలా పూర్తి చేస్తారో ఆ అధికారికే తెలియాలి? ఇది తెలిసిన విద్యావేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు.

విద్యాశాఖలో కోరిన చోటకు వెళ్లేందుకు ముడుపులు?

ఒక్క టీచర్‌కు ఏకంగా రెండుచోట్ల పోస్టింగ్‌

వర్క్‌అడ్జస్ట్‌మెంట్‌ పేరుతో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

కొన్నిబడుల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అక్కడి నుంచి హైదరాబాద్‌కు సమీప మండలాలకు బదిలీ చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో అస్సలే టీచర్ల కొరత ఉండగా ఈ బడుల నుంచి ఎలా బదిలీ చేస్తారని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అక్కడి టీచర్లను రిలీవ్‌ చేయటం లేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement