ఇల్లు పూర్తయినా..
ఇందిరమ్మ ఇల్లు.. గొల్లు
నిరుపేద మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, సర్వే సమయంలో ఓ అధికారి చేసిన తప్పిదం తీవ్ర నష్టానికి గురి చేసింది. ఇంటి నిర్మాణం పూర్తయి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు నయా పైసా బిల్లు మంజూరు కాలేదు. బాధితురాలు రేకులషెడ్డులో నివాసం ఉంటుండగా, అదే పేరుతో ఉన్న మరో మహిళకు చెందిన నివాస భవనం అప్‌లోడ్ చేయడంతో సమస్య జఠిలమైంది.
– రామాయంపేట/నిజాంపేట(మెదక్)
నిజాంపేట మండలం నస్కల్‌కు చెందిన ఎమ్మ లక్ష్మి (భర్త సత్తయ్య) తన పిల్లలతో కలిసి రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. మొదటి విడతలో ఆమెకు ఇందిరమ్మ పథకంలో ఇల్లు మంజూరైంది. దీంతో ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలకు తోడు అదనంగా మరికొన్ని డబ్బులు వేసుకొని భవనం నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. గ్రామంలో సర్వే నిర్వహించిన సమయంలో కార్యదర్శి మమత రేకుల షెడ్డుకు బదులుగా అదే పేరుతో ఉన్న మరో మహిళ నివాసం ఉంటున్న భవనం ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంటి నిర్మాణం కోసం అధికారులు ముగ్గు పోయగా, నిర్మాణ పనులు ప్రారంభించారు. తీరా ఇంటి నిర్మాణ పూర్తయిన తర్వాత తీసిన ఫొటోలను గృహ నిర్మాణశాఖ అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. బిల్లులు మంజూరు బిల్లు కోసం లక్ష్మి భర్త సత్తయ్య అధికారుల వద్దకు వెళ్లగా, అప్పుడు విషయం బయటపడింది. ఆన్‌లైన్‌లో రేకుల షెడ్డుకు బదులుగా భవనం ఫొటో అప్‌లోడ్ అయిందని, త్వరలో సమస్య పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. గోడల నిర్మాణం, స్లాబ్ పూర్తి చేస్తే ఒకేసారి మూడు బిల్లులు ఇస్తామని వారు నచ్చజెప్పడంతో నమ్మిన సత్తయ్య అప్పు చేసి నిర్మాణ పనులు పూర్తిచేశారు. కాగా, ఇది గడిచి ఏడాది కావొస్తుండగా ఇప్పటివరకు నయా బిల్లు కూడా రాక అప్పుల పాలైన సత్తయ్య పలుమార్లు కలెక్టర్, గృహ నిర్మాణశాఖ పీడీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు.
అధికారుల తప్పిదం. నిరుపేద మహిళకు తీరని అన్యాయం
రేకుల షెడ్డుకు బదులుగా మరో భవనం ఫొటో అప్‌లోడ్
ఆలస్యంగా తప్పు తెలుసుకున్న అధికారులు


