విద్యార్థుల జూపార్కు సందర్శన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల జూపార్కు సందర్శన

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

విద్యార్థుల జూపార్కు సందర్శన సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం కుష్ఠువ్యాధి నిర్మూలించాలి కులగణన చేయాలి

మెదక్‌ కలెక్టరేట్‌: కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ సందర్శనకు తీసుకెళ్లినట్లు డీఈఓ రాజు తెలిపారు. ఇందులో 94 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు 63 మంది, నలుగురు మంది విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది, మొత్తం 148 మంది మూడు బస్సుల్లో హైదరాబాద్‌కు వెళ్లినట్లు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎప్పుడూ ఇంటి పరిసరాల్లోనే కాకుండా బయట ప్రపంచాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

జిల్లా వైద్యాధికారి గణేశ్వర్‌

చేగుంట(తూప్రాన్‌): సీజనల్‌ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి గణేశ్వర్‌ పేర్కొన్నారు. మండలంలోని జెత్రం తండాను శుక్రవారం జిల్లా వైద్యాధికారి సందర్శించారు. ఈ సందర్భంగా తండాలో ఇంటింటికీ తిరిగి గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత దోమల వ్యాప్తి అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఇటీవల అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న రసీదులను పరిశీలించి వారికి జాగ్రత్తలను తెలిపారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా గిరిజనులు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సుభాష్‌ నాయక్‌, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, వార్డు సభ్యులు మోహన్‌, శోభ, లాలి, అనిత, గణేశ్‌, స్వప్నతోపాటు తండా వాసులు ఉన్నారు.

రాష్ట్ర శాంపిల్‌ సర్వే అధికారి సంపత్‌

మెదక్‌ కలెక్టరేట్‌: కుష్ఠువ్యాధి నిర్మూలన మన బాధ్యత అని, వైద్యులంతా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర శాంపిల్‌ సర్వే అధికారి సంపత్‌ పేర్కొన్నారు. జిల్లా వైద్యశాఖ అధికారి కార్యాలయంలో శుక్రవారం లెప్రసీ నోడల్‌ ఆఫీసర్లకు కుష్ఠువ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే అధికారి సంపత్‌ మాట్లాడుతూ..వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సూపర్‌వైజరీ స్టాఫ్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అనుమానిత కుష్ఠువ్యాధి లక్షణాలున్న వ్యక్తులను గుర్తించాలన్నారు. వైద్యుల ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి త్వరితగతిన మందులు వాడించడం ద్వారా కుష్ఠువ్యాధి పూర్తిగా నయమవుతుందని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడవచ్చని హెచ్చరించారు. జిల్లా అధికారి హరిప్రసాద్‌ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రత్యేక ప్రణాళికతో కుష్ఠువ్యాధి నిర్మూలన కోసం ఇంటింటికీ సర్వే నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర శాంపిల్‌ సర్వే అసెస్మెంట్‌ బృందం జిల్లాలోని మనోహరాబాద్‌, శివ్వంపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు

నోముల శ్రీకాంత్‌

మెదక్‌ కలెక్టరేట్‌: దేశ జనాభాలో 80% ఉన్న బీసీలకు రిజర్వేషన్‌ మాత్రం దక్కడం లేదని, ప్రభుత్వాలు చేపడుతున్న జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ...దేశవ్యాప్తంగా జరుగుతున్న కులగణనతోపాటు ప్రతీ కులానికి ఓకే యూనిక్‌ కోడ్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు తెలంగాణాలో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మపోరాట దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు గంగారాం, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ నరసింహులు, మెదక్‌ అసెంబ్లీ బీసీ సంఘం అధ్యక్షుడు సాప రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement