పనిచేసే కార్యకర్తలకే పదవులు | - | Sakshi
Sakshi News home page

పనిచేసే కార్యకర్తలకే పదవులు

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

మెదక్‌జోన్‌: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు కొంత నిరాశ నిస్పృహలో ఉన్నారని, అర్హులకు పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. సోమవారం ఉమ్మడి మెదక్‌ జిల్లా పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) సమావేశం మెదక్‌లో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని తనతో పాటు సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఢిల్లీ పెద్దలు చర్చించారని తెలిపారు. ప్రాదేశిక సహకార సంఘాల్లో (పీఏసీఎస్‌లు) నామినేటెడ్‌ కాబోతున్న పదవులు ముఖ్య కార్యకర్తలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందని, మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన జోస్యం చెప్పా రు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పాటు ఆరు గ్యారంటీల అమలు సంపూర్ణంగా జరుగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ఓటరు సమగ్ర సవరణ (సర్‌) పేరుతో రాష్ట్రంలో ఎంతో మంది ఓట్లను కేంద్రం తొలగిస్తుందని, అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా కార్యకర్తలు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు.

వర్గ రాజకీయాలతో పార్టీకి నష్టం: మంత్రి

అనంతరం వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కార్యకర్తలతోనే పార్టీ మనుగడ సాగుతుందని, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అందరం కలిసికట్టుగా ఉంటేనే బలోపేతం అవుతుందన్నారు. వర్గ రాజకీయాలతో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిని పార్టీ ఉపేక్షించదని హెచ్చరించారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడి నామినేటెడ్‌ పదవుల గురించి చర్చించినట్లు తెలిసింది. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రావు, సంజీవరెడ్డి, రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హన్మంతరావు, మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కానుగ రాధిక, వైస్‌ చైర్మన్‌ దొంతి నరేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావటం ఖాయం

‘సర్‌’లో అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోవద్దు

ఉమ్మడి మెదక్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌

డీసీసీ అధ్యక్షుల డుమ్మా!

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ (పీఏసీ) ఉమ్మడి మెదక్‌ జిల్లా సమావేశానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మలారెడ్డి దూరంగా ఉన్నారు. ముఖ్య కార్యకర్తల సమావేశానికి వారిద్దరు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి హాజరైనప్పటికీ ఆయన వేదిక పైన ఎక్కడో మూలన కూ ర్చుండి పోయారు. సమావేశం ముగియకుండానే మధ్యలో నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్‌లోని వర్గ విభేదాలపై ద్వితీయ శ్రేణి కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement