కాఫీ, కేఫ్‌ల పేరుతో స్మోకింగ్ జోన్లు
జిల్లాలో విచ్చలవిడిగా స్మోకింగ్ జోన్లు వెలుస్తున్నాయి. గ్రామాలు, పట్టణ శివారులో టీ స్టాళ్లు, కేఫ్‌లు ఏర్పాటు చేసి పక్కనే కొంత స్థలంలో చుట్టూ ప్రత్యేక తెర ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నిబంధనలకు విరుద్దంగా మైనర్లకు సిగరేట్లు విక్రయిస్తున్నారు. ప్రధానంగా యువత టార్గెట్‌గా కొనసాగుతున్న ఈ సెంటర్లతో ఎంతో మంది పిల్లలు మత్తుకు బానిసలవుతూ పెడదోవపడుతున్నారు.
– రామాయంపేట(మెదక్)
18 ఏళ్లలోపు మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయించడం తీవ్రమైన నేరం. అయితే ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. హోటళ్లు, టీ స్టాళ్లలో యథేచ్ఛగా సిగరేట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తులను బహిరంగంగానే అమ్ముతున్నారు. కళాశాలలు, స్కూళ్లకు వంద మీటర్ల లోపు ఈ ఉత్పత్తులు విక్రయించడం నేరం, అయినా ఎవరూ పాటించటం లేదు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు, మున్సిపల్, పంచాయతీ అధికారులు ఆ దిశగా చర్యలూ తీసుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో పాఠశాలల ప్రహరీని ఆనుకొని ఉన్న దుకాణాల్లో యథేచ్ఛగా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరల మాటున పొగ గుప్పుమంటోంది. ఇక్కడ గంటల తరబడి కాలక్షేపం చేస్తున్న యువత పొగ పీలుస్తున్నారు. తొలుత స్నేహితుల ప్రోత్సాహంతో ప్రారంభమవుతున్న ఈ అలవాటు, కాలక్రమేణా వ్యసనంగా మారుతోంది. చివరకు గంజాయికు అలవాటు పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
హోటళ్లు, టీ స్టాళ్లలో యథేచ్ఛగా నిర్వహ ణ
మత్తులో జోగుతున్న యువతరం


