తూప్రాన్: ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న ఐరన్ పరిశ్రమను తొలగించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్, కాలుష్య నియంత్రణ మండలికి గ్రామస్తులతో కలిసి బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమను చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వాయు, జల, శబ్ద కాలుష్యంతో ప్రజలు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమను తొలగించే వరకు ప్రజల తరఫున పోరాటాలు చేస్తామన్నారు.


