మిరుగుడుపల్లెను మింగిన పోచారం ప్రాజెక్టు
మెదక్–కామారెడ్డి జిల్లాల సరిహద్దులోగల పోచారం ప్రాజెక్టును సుమారు 105 ఏళ్ల క్రితం నిర్మించారు. ఆ ప్రాజెక్టుపై భాగంలో మిరుగుడుపల్లె అనే గ్రామం ఉండేది. దాన్ని నిర్మించటంతో బ్యాక్‌వాటర్‌లో ఊరితోపాటు ఉపాధినిచ్చే భూములు కూడా అందులోనే మునిగిపోయాయి. దీంతో ఆ గ్రామస్థులు పొట్టచేతబట్టుకుని ప్రాజెక్టుకు కొంతదూరంలో రాళ్లుగుట్టల అంచున స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆ గ్రామం పోచమ్మరాల్ అయింది. దీంతో జీవనోపాధి కోసం దానికి కొంతదూరంలో పోడు భూములను సాగు చేసుకుంటూ 30 ఏళ్ల పాటు జీవనం సాగించాక ఆ భూములు మా శాఖకు చెందినవని అటవీ అధికారులు వాటిని లాగేసుకుని అందులో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. ఇక చేసేదిలేక ప్రాజెక్టుకు కొద్దిదూరంలో గుట్టను ఆనుకున్న అసైన్డ్ భూములను కుటుంబానికి ఎకరం, రెండు ఎకరాల చొప్పున సాగు చేసుకుని జీవిస్తుండగా మెదక్–బోధన్ హైవే 765–డీ రోడ్డు వెడల్పులో భాగంగా మరికొన్ని భూములు కోల్పోయారు.
ఉన్న కొద్దిభూమి ట్రస్టుకు..
అప్పటి మిరుగుడుపల్లి బాధితులు నేటి పోచమ్మరాల్ ప్రజలు ఎక్కడ భూమిని పట్టుకున్నా అది ఏదో విధంగా వారికి సొంతం కాకుండా పోతుంది. ఇకపోతే ప్రాజెక్టును ఆనుకుని గుట్టలు, రాళ్లు, రప్పలతో 30–40 ఎకరాలలో ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని ఆ గ్రామ అవసరాల కోసం ప్రజలు చాలాకాలంగా వాడుతున్నారు. కాగా, ఆ భూమిని సుమారు 40 ఏళ్ల క్రితం రెవెన్యూ అధికారులు హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రస్టుకు 25 ఎకరాల భూమిని వారికి కేటాయించారు. దీంతో ఆ ట్రస్టుకు సంబంధించి వ్యక్తులు గతంలో ఆ భూమి చుట్టూ కంచె వేయగా పోచమ్మరాల్ గ్రామస్థులు కంచెను తొలగించి నిర్మాణాలను ఆపినట్లు తెలిసింది. కాగా, ఇటీవల మళ్లీ ఆ ట్రస్టు సభ్యులు కంచె వేసి అందులో పలు కార్యక్రమాలు చేయటంతో వాటిని అడ్డుకుని ఇటీవల కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఆ భూములను మా గ్రామ అవసరాలకు మాత్రమే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లో ట్రస్టుకు ఇవ్వొదంటూ డిమాండ్ చేస్తున్నారు.
పోచమ్మరాల్ తండా
వందేళ్లకు పైబడి మిరుగుడు పల్లె ప్రజలను విధి వంచిస్తూనే ఉంది. ఊరితోపాటు జీవనోపాధినిచ్చే భూములను ఓ ప్రాజెక్టు నిర్మాణంలో పోగొట్టుకున్నారు. పొట్ట చేతబట్టుకుని మరోచోట పోడు భూములను 30 ఏళ్లపాటు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తే, అవి మా భూములంటూ అటవీఅధికారులు లాక్కున్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా మరికొంత భూమి జాతీయ రహదారికి పోయింది. ప్రాజెక్టును ఆనుకునున్న మరికొంత అసైన్డ్ భూమిని ఊరు అవసరాలకు వినియోగించుకుంటే రెవెన్యూ అధికారులు ఓ ట్రస్టుకు ధారాదత్తం చేయటంతో ఆ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఆ భూమిని గ్రామ అవసరాలకే కేటాయించాలని ఆ బాధిత పల్లెజనం ముక్తకంఠంతో వేడుకుంటున్నారు.
– మెదక్‌జోన్
పోడు భూములను లాక్కున్న అటవీఅధికారులు
రోడ్డు వెడల్పులో కోల్పోయిన మరికొంత భూమి
ఉన్న కొద్దిపాటి అసైన్డ్ భూమిని ఓ ట్రస్టుకు ధారాదత్తం చేసిన రెవెన్యూ శాఖ
ఆందోళన చెందుతున్న పోచమ్మరాల్ గ్రామస్థులు
ఆ భూమి గ్రామ అవసరాలకే ఇవ్వాలి
మిరుగుడుపల్లి బాధితులు వందేళ్లుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉన్న కొద్దిభూమి తాజాగా రోడ్డు వెడల్పులో పోయింది. కాగా ప్రాజెక్టు వద్ద ఉన్న భూమి గ్రామ అవసరాలకే ఇవ్వాలి.
– రాజు, పోచమ్మరాల్, సర్పంచ్
ఇదేం తలరాత!
ప్రాజెక్టులో ఊరుమునిగి పోగా పొట్టచేత పట్టుకుని మా తాతలు, తండ్రులు వేరేచోట పోడు భూములు సాగు చేసుకుంటే వాటిని లాక్కోవటం, మరికొంత భూమి రోడ్డు వెడల్పులో పోవటం, ఉన్న కొద్దిపాటి భూములను ట్రస్టుకు అప్పగిస్తే మా బతుకు దెరువెలా.?
– రూప్‌సింగ్, పోచమ్మరాల్ తండా


