మెదక్ కలెక్టరేట్: క్రిస్టియన్, మైనార్టీ సంక్షేమానికి నిరంతరం కృషి చేయడంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిండమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబిత పేర్కొన్నారు. మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా ఆమె గురువారం సీఎస్‌ఐ చర్చ్‌ను సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మైనార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రిస్టియన్ మైనార్టీలకు ఆర్థికాభివృద్ధి కోసం పథకాలు కేటాయించారన్నారు. ఇందుకోసం జూలై 3 నుంచి 31 వరకు 198 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఇందులో కుట్టు మెషీన్లు, ఎలక్ట్రిక్ స్కూటీలు, చిన్న చిన్న వ్యాపారాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ దరఖాస్తుల స్క్రీనింగ్ జరుగుతుందని ఈ నెల 11న రాష్ట్ర కార్యాలయానికి అర్హుల జాబితా అందిస్తే వారికి స్కూటీలు, కుట్టు మెషీన్లు, రూ.50వేల రుణాలు అందజేయనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 200ల వరకు దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వారం రోజుల్లో వాటిని పరిశీలించి రుణాలు అందజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతకుముందు డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్‌తో సమావేశమై మైనార్టీ సంక్షేమ పథకాల గురించి చర్చించారు. ఆమె వెంట జిల్లా మైనార్టీ ఇన్‌చార్జి అధికారి ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కమిటీ చైర్మన్ సూఫీ, ఫసీ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత


