నెలాఖరు వరకు ఈ–కేవైసీ | - | Sakshi
Sakshi News home page

నెలాఖరు వరకు ఈ–కేవైసీ

Aug 1 2026 7:46 AM | Updated on Aug 1 2026 7:46 AM

జిల్లాలో ఇలా..

రామాయంపేట(మెదక్‌): రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించింది. ఈ–కేవైసీ గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా.. భారీ వర్షాలు, సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా లబ్ధిదారులు ఈనెల 31 వరకు ఈ–కేవైసీ పూర్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని పౌర సరఫరాల అధికారులు సూచిస్తున్నారు.

అనర్హుల తొలగింపు!

జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్‌ కార్డులలో బియ్యం తీసుకొని వారు, మృతిచెందిన వారిని జాబితా నుంచి తొలగించడం లేదు. దీంతో ప్రతీనెల వారి కోటా యథావిధిగా సరఫరా అవుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం కార్డులో ఉన్న లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్‌ కార్డు తీసుకువెళ్లి ఈ–కేవైసీ చేసుకోవాలని సూచించింది.

చిన్నారులు, వృద్ధుల ఇబ్బందులు

ఈ–కేవైసీ నమోదులో జిల్లాలో ఉన్న చిన్నారులతో పాటు వృద్ధులు తమ వేలిముద్రలు పడక తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వేలిముద్రలు అప్డేట్‌ చేయించుకునేందుకు ఆధార్‌ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో వేలిముద్రలు రాక రేషన్‌ కార్డులో తమ పేరు తొలగిపోతుందేమోనని భయందోళనకు గురయ్యారు. తాజాగా ప్రభుత్వం గడువు పెంచడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే చిన్నారుల ఈ–కేవైసీ వేలిముద్ర ద్వారా కాకుండా ఐరిస్‌ డివైస్‌ ద్వారా వేగంగా, సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతీ డీలర్‌ తప్పనిసరిగా ఐరిస్‌ డివైస్‌ను వినియోగించి ఈప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

నేటి నుంచి మూడు నెలల కోటా

జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల్లో నేటి నుంచి ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మూడు నెలలకు సంబంధించి బియ్యం ఒకేసారి పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు రేషన్‌ దుకాణాల్లో తమ పూర్తి వివరాలు అందించి ఉచితంగా ఈ–కేవైసీ చేయించుకోవచ్చు. పెంచిన గడువును సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

రేషన్‌ కార్డుదారులు 2,41,832

సభ్యులు 7,90,304

ఈ–కేవైసీ పూర్తి చేసిన వారు 6,42,020

చేయాల్సిన వారు 1,48,284

గడువు పొడిగించిన ప్రభుత్వం

రేషన్‌కార్డుదారులకు ఊరట

జిల్లాలో ఇప్పటివరకు 81.24% ప్రక్రియ పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement